
బెంగళూరులో ఇటీవల చోటుచేసుకున్న ఐటీ ఉద్యోగుల నిరసనలు, భారత టెక్నాలజీ వర్క్‌ఫోర్స్ ఎదుర్కొంటున్న ఒక అత్యవసరమైన సమస్యను వెలుగులోకి తెచ్చాయి. కర్నాటక ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘కర్నాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్ 2025’ ప్రకారం ఐటీసేవల రంగాల్లో రోజువారీ పనిగంటలను 12కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం ప్రకటించగానే, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బెంగళూరులోని గ్లోబల్ టెక్ పార్క్‌లో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. దీనిని ‘ఆధునిక దాస్యం’గా అభివర్ణించారు.
డిజిటల్ ఆర్థికవ్యవస్థను నడిపిస్తున్న ఈ యువతరం.. పెరిగిన పని గంటలు తమ జీవన, - పని సమతుల్యతను చెరిపేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శారీరక, -మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, ఉద్యోగ భద్రతను మరింత అస్థిరం చేస్తాయని గట్టిగా తమ గళాన్ని వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా జరిపిన పరిశోధనలు కూడా ఈ ఆందోళనకు బలం చేకూరుస్తున్నాయి. వారానికి 45–48 గంటలు మించిన పని ఒత్తిడి.. డిప్రెషన్, బర్నౌట్, హృదయ సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని స్పష్టమైంది. ముఖ్యంగా 22–35 ఏళ్ల మధ్య వయస్సుగల యువ వృత్తి నిపుణులు మానసిక ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా గురవుతున్నారు. 12 గంటల షిఫ్ట్‌లు నిద్ర అలవాట్లను దెబ్బతీసి కుటుంబ-, సామాజిక జీవితానికి సమయం లేకుండా చేసి, ఉత్పాదకత తగ్గించి, తప్పిదాలను పెంచే ప్రమాదం ఉంది.
ఉద్యోగి వస్తువు కాదు!
ఉద్యోగుల మరో ప్రధాన ఆందోళన ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలపై ఉంది. సవరణల ప్రకారం వారంలో తక్కువ పని రోజులు ఉంచి, కంపెనీలు తక్కువమంది సిబ్బందిని నియమించుకోవచ్చని, అవసరమైనప్పుడు సులభంగా తొలగించవచ్చని భావిస్తున్నారు. అదనపు పని గంటలకు చెల్లింపు లేకపోవడం, సెవరెన్స్ ప్యాకేజీలు లేకపోవడం వల్ల ఈ రంగంలో పని చేస్తున్నవారు తమను ‘వస్తువుల్లా’ భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నిరసనలు భారత ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగ సంస్కృతిలోని లోతైన సమస్యలను ప్రతిబింబిస్తున్నాయి.
ఇది ఆరంభం మాత్రమేమన దేశానికి సమగ్ర, మానవీయ కార్మిక విధానం అత్యవసరం. పని గంటలకు పరిమితులు పెట్టడం, న్యాయమైన వేతనాలు నిర్ధారించడంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడం అవసరం. ఉద్యోగుల సంక్షేమం అన్ని విధానాల్లో ప్రతిబింబించాలి. ఉద్యోగులు భయపడకుండా తమ ఆలోచనలు చెప్పగల వాతావరణం ఏర్పడాలి. హైదరాబాద్‌కు చెందిన ఐటీ వృత్తి నిపుణుడు, సామాజిక-రాజకీయ కార్యకర్త, ప్రజా విధాన విశ్లేషకుడిగా నేను విధాన నిర్మాతలు, సంస్థలు, పౌరులందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
శ్రామికుల సంక్షేమమే ఉత్పత్తికి ఆధారం
భారత ఐటీ రంగం విజయం కేవలం ఉత్పత్తులపై ఆధారపడి ఉండదు. అది తన శ్రామికుల సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి అనే పేరుతో మానవ గౌరవం, ఆరోగ్యం తాకట్టు పెట్టకూడదు. నిజమైన డిజిటల్ విప్లవం అంటే మన జీవితాలను మెరుగుపరిచేదిగా ఉండాలి. అంతేకానీ దెబ్బతీసేదిగా ఉండకూడదు. స్పష్టమైన విధానాలు, కఠినమైన అమలు, మానసిక ఆరోగ్య మద్దతు వంటి చర్యల ద్వారా భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త మోడల్‌గా నిలబడవచ్చు.
నవ్యత, దయ కలిసే వాతావరణం మాత్రమే సుస్థిర అభివృద్ధికి పునాది. మన డిజిటల్ భవిష్యత్తును నిర్మించేవారు విలువైనవారిగా, రక్షితులుగా, గౌరవించాల్సినవారుగా ఉండాలి. బెంగళూరులో ప్రారంభమైన ఈ పోరాటం, శ్రామిక హక్కుల చరిత్రలో ఒక మలుపు. ఇది కేవలం ఒక విజయగాథ కాదు. మనకు ఎదురైన సవాలు, ఒకే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా. న్యాయమైన, సుస్థిరమైన, మానవీయమైన ఐటీ వర్క్‌ఫోర్స్ నిర్మాణంలో ఇది ఒక కీలక దశ.
ఆర్థికాభివృద్ధికి మూలస్తంభం ఐటీ రంగం
ఐటీ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి మూలస్తంభం. అయినప్పటికీ, మౌలిక శ్రామిక హక్కులు, మానసిక ఆరోగ్య పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు చాలాసార్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. జీవన వ్యయానికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం, నైపుణ్యాల పెంపుకోసం తగిన శిక్షణలో పెట్టుబడులు పెట్టకపోవడం ఉద్యోగులను మరింత అరక్షిత స్థితిలోకి నెడుతోంది.
తీవ్ర ప్రతిఘటనల తర్వాత చివరికి కర్నాటక ప్రభుత్వం 12 గంటల షిఫ్ట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఉద్యోగుల గొప్ప విజయం మాత్రమే కాదు, పౌర హక్కుల పరిరక్షణలోనూ ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ సంఘటన.. కలిసికట్టుగా నిలబడితే మార్పు సాధ్యమవుతుందని, అలాగే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉద్యోగుల గొంతు వినడం ఎంత అవసరమో మరోసారి నిరూపించింది.
- శశిధర్ వుప్పల,
ఐటీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్