వెయ్యి రోజుల క్రితం సెంచరీ చేసిన కోహ్లీ

వెయ్యి రోజుల క్రితం సెంచరీ చేసిన కోహ్లీ

టీమిండియా రన్ మెషన్..కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేయక వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ చివరి సారిగా  నవంబర్ 23, 2019న బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 136 పరుగులు చేశాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 68  మ్యాచ్‌లలో ఆడాడు. 82 ఇన్నింగ్స్‌లలో 34.05 సగటుతో అన్ని ఫార్మాట్లలో 2,554 పరుగులు చేశాడు. అంతేకాదు 24 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కానీ సెంచరీ మాత్రం సాధించలేకపోయాడు. 

సెంచరీ తర్వాత ఎన్ని పరుగులు..
2019లో  టెస్టుల్లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాక కోహ్లీ..18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 32 ఇన్నింగ్స్‌లలో 27.25 సగటుతో 872 పరుగులు చేశాడు. 79 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఆరుసార్లు యాభై పరుగుల మార్కును దాటాడు. కానీ సెంచరీ మాత్రం కొట్టలేకపోయాడు.  చివరి సెంచరీ తర్వాత 23 వన్డేలు ఆడిన కోహ్లీ..35.82 సగటుతో 824 పరుగులు సాధించాడు. 89 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఈ ఫార్మాట్‌లో పది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాడు. ఇక 27 టీ20ల్లో  42.90 సగటుతో 858 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ స్కోరు 94*.  చివరి సెంచరీ తర్వాత టీ20ల్లో ఎనిమిది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం కోహ్లీ సాధించలేకపోయాడు. 

శతకం తర్వాత చెత్త ఫాం..
2020, 2021, 2022లో కోహ్లీ అత్యంత చెత్తగా ఆడుతున్నాడని చెప్పొచ్చు. ఈ మూడేళ్లలో ఒక్క కాలెండర్ ఇయర్ లో కూడా  కోహ్లీ కనీసం ఒక్కసారి కూడా వెయ్యి పరుగుల మార్కును దాటలేకపోయాడు.  2019లో చివరి శతకం సాధించిన తర్వాత కోహ్లీ ఆ ఏడాది చివర్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు.  ఆరు ఇన్నింగ్స్‌లలో 68.00 సగటుతో 272 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 94* పరుగులు. మూడు అర్ధ సెంచరీలు కొట్టి..2019ని బాగానే ముగించాడు.  అయితే 2020లో కోహ్లీ 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 24 ఇన్నింగ్స్‌లలో 36.60 సగటుతో 842 పరుగులు చేశాడు. 2020లో ఏడు అర్ధ సెంచరీలు కొట్టాడు. అత్యుత్తమ స్కోరు 89.  ఇక2021లో  24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడాడు. 30 ఇన్నింగ్స్‌లలో..37.07 సగటుతో 964 పరుగులు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో పది అర్ధ సెంచరీలు కొట్టాడు. అత్యుత్తమ స్కోరు 80*.  ఈ ఏడాది ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడగా..19 ఇన్నింగ్స్‌లలో.. 25.05 సగటుతో 476 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 79 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఇప్పటి వరకు కేవలం నాలుగు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 

ఆసియాకప్ లో సెంచరీ చేస్తాడా..?
ఒకప్పుడు సరదాగా సెంచరీలు కొట్టే తమ అభిమాన క్రికెటర్ కోహ్లీ..పరుగులు చేయడానికి తంటాలు పడుతుండటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే  సుధీర్ఘ విరామం తర్వాత  ఆసియా కప్ 2022లో ఆడబోతున్న కోహ్లీ..తిరిగి ఫాంలోకి వస్తాడని ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు.  ఆగస్ట్ 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుండటంతో.. కోహ్లీ మళ్లీ తన సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. టోర్నమెంట్‌లో ఫామ్‌లోకి వచ్చి.. 71వ అంతర్జాతీయ సెంచరీ కొడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.