బల్దియా కౌన్సిల్ ఏర్పడి రెండేళ్లు పూర్తి

బల్దియా కౌన్సిల్ ఏర్పడి రెండేళ్లు పూర్తి

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడి ఈ  నెల11తో  రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికీ గ్రేటర్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రచారంలో భాగంగా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడం తన బాధ్యత అని మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ అమలు చేయడం లేదు. మేనిఫెస్టోలోని ప్రధాన హామీల్లో 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్​స్కీం ఒకటి. ఈ  స్కీం అమల్లోకి వచ్చినప్పటికీ అనేక కారణాలు చూపుతూ అధికారులు అర్హులకు కూడా బిల్లులు వేస్తున్నారు. భారీ వర్షాలకు సిటీలోని కాలనీలు, ఇండ్లు నీట మునగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినా కనీసం పట్టించుకోలేదు. ముంపు కాలనీల్లో నేటికీ అవే పరిస్థితులు ఉన్నాయి. ఎస్ఎన్ డీపీ ద్వారా నాలాల పనులు చేస్తున్నామని, రూ.12 వేల కోట్ల ఖర్చు అవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కేవలం రూ.633 కోట్లకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అంచనాలో ఇవి 5 శాతం మాత్రమే. మిగతా 95 శాతం నిధులు ఇస్తేనే సిటీలో ముంపు సమస్య తీరేది. ప్రస్తుతం  37 నాలాల నిర్మాణాలు జరుగుతుండగా, కేవలం రెండు చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే వర్షాకాలం నాటికి కూడా నాలాల పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.

ఎలక్ట్రిక్​ బస్సులు పెరిగేదెప్పుడు?

మూసీ నది బ్యూటిఫికేషన్​తోపాటు బాపూ ఘాట్ నుంచి నాగోల్ వరకు బోటింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని, ఇందుకోసం రూ.5 వేల కోట్లు ఖర్చు ఎన్నికలప్పుడు చెప్పారు. ఆ పనులు మొదలు కాలేదు. ఎంఎంటీఎస్ రైళ్లను మరో 90 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చినా ఆ ప్రాసెస్ నత్తనడకన కొనసాగుతోంది. హెచ్ఎండీఎ పరిధిలోని 2,700 చెరువులను దశల వారీగా డెవలప్ ​చేస్తామన్నప్పటికీ, ఇప్పటికీ చాలా చెరువుల దగ్గరు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల రూపురేఖలు మారుస్తామని, ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని పెంచుతామన్న ప్రభుత్వం సిటీలోని 800 బస్సులను తీసేసింది. 132, 11కేవీ హైటెన్షన్ విద్యుత్​ కేబుళ్లతో నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్​లో ఏర్పాటు చేస్తామని పూర్తిస్థాయిలో చేయలేదు. ఇప్పటికే 5 లక్షల సీసీ కెమెరాలు ఉండగా, మరో 5 లక్షలు ఏర్పాటు చేసి భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా చూస్తామని పట్టించుకోలేదు. సిటీకి వచ్చే వారి కోసం షెల్టర్ హోమ్స్ విస్తరిస్తామని చెప్పి వదిలేశారు. 

‘డబుల్’ ఇండ్లు వచ్చి 4 వేల మందికే!

గ్రేటర్ ​సిటీలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిచ్చి ఇస్తామని ప్రతి మీటింగులో మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 4 వేల మందికి మాత్రమే ఇండ్లు అందించారు. నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదు. అప్లికేషన్లు పెట్టుకున్న వారు గవర్నమెంట్ ​ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని చెప్పి హుజూరాబాద్ బై ఎలక్షన్స్ ​టైంలో కొంతమందికి ఇచ్చి మమ అనిపించారు. నేటికీ వేలాదిమంది కొత్త రేషన్​కార్డులు, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. భర్తలను కోల్పోయిన మహిళలు పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. 

బస్తీల్లో మోడల్​ స్కూళ్లేవి?

బస్తీల్లో ఇంగ్లీష్ మీడియంతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అదే విధంగా స్టూడెంట్లు, నిరుద్యోగుల కోసం లైబ్రరీలు, వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి వదిలేశారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్​లో లైబ్రరీ, సీనియర్ సిటిజన్స్ క్లబ్, యోగా సెంటర్, జిమ్స్ ఏర్పాటు చేసి, ఉచితంగా బస్ పాస్​ఫెసిలిటీ కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఏ ఒక్కటీ అమలు కావడం లేదు.  

ఏదో ఒక సాకు చూపి..

బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికీ ఉచితంగా 20 వేల లీటర్ల తాగు నీరు అందిస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రెండో అంశంగా పెట్టారు. ఫ్రీ వాటర్ స్కీం అమల్లోకి తెచ్చినప్పటికీ.. నేటికీ 
పూర్తిస్థాయిలో అర్హులకు అందడం లేదు. కొన్ని ఇండ్లకు మాత్రమే ఫ్రీ వాటర్ సరఫరా అవుతోంది. మొదట్లో ఫ్రీ వాటర్​స్కీం పొందిన వారికి కూడా అధికారులు ఇప్పుడు బిల్లులు వేస్తున్నారు. చాలా కాలనీలు, మురికి వాడల్లో ఈ ​స్కీం అందడం లేదు. పథకాలు సజావుగా అమలు అవుతున్నాయా? లేదా అనే విషయాన్ని మంత్రులు పట్టించుకోవడం లేదు.

ఫండ్స్​ ఎందుకు ఇవ్వట్లే?

ఉచితంగా తాగునీరు అందిస్తామని బల్దియా ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఇప్పుడు ఏదో ఒక సాకుతో అర్హులను అనర్హులు అంటున్నారు. మొన్నటి దాకా 
ఫ్రీ వాటర్ స్కీం పొందిన వారికి ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి. ఈ విషయంపై మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ పనులకు ప్రభుత్వం ఫండ్స్ ఎందుకు కేటాయించడం లేదు. ప్రతి హామీని నెరవేర్చాలి.

- కొప్పుల నర్సింహారెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్