వేస్ట్​ టు వార్డ్​రోబ్​

వేస్ట్​ టు  వార్డ్​రోబ్​

తమిళనాడుకి చెందిన కె. శంకర్​, సెంథిల్​... తండ్రీ కొడుకులు. ఈ ఇద్దరూ ఐఐటీల్లో చదివారు. మంచి ఉద్యోగాల్లో చేరారు. కానీ... ‘సొంతంగా ఏదైనా చేయాలి. అది నలుగురికీ ఉపయోగపడాలి’ అనే ఆలోచన శంకర్​ది. దాంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. పర్యావరణానికి నష్టం కలిగించే పెట్​ బాటిల్స్​ను ఫ్లేక్స్​, ఫైబర్​గా మార్చే కంపెనీ పెట్టాడు. ఆ తరువాత కొడుకు కూడా తండ్రి బాటపట్టాడు. పెట్​బాటిల్స్​తో ‘ఎకోలైన్’ పేరిట ఫ్యాషన్​​ క్లోతింగ్​ తయారుచేస్తున్నాడు. పెట్​బాటిల్స్​ను బట్టలుగా మార్చి రోజుకి 15 లక్షల పెట్​ బాటిల్స్​ చెత్త భూమ్మీద, సముద్రంలో పేరుకుపోకుండా ఆపగలిగాడు. అంతేకాదు ఈ  క్లోతింగ్​ బ్రాండ్​ తమిళనాడు నుంచి పార్లమెంట్​ వరకు ట్రావెల్​ చేసింది కూడా! 

ప్లాస్టిక్​ టు గార్మెట్స్​ జర్నీ గురించి 37 ఏళ్ల సెంథిల్ మాట్లాడుతూ ‘‘పెట్​ బాటిల్స్​ నుంచి క్లోతింగ్​ తయారుచేస్తున్న నా గురించి చెప్పేకంటే ముందు మా నాన్న గురించి చెప్పాలి. మా నాన్న కె.శంకర్​ పాలీమర్​ ఇండస్ట్రీలో మంచి ఉద్యోగం చేసేవారు. కానీ ఆయనకు ఎంట్రప్రెనూర్​ కావడం ఇష్టం. అందుకే పెట్​ బాటిల్స్​ను​ ఫ్లేక్స్​గా మార్చే మైక్రోలెవల్​ బిజినెస్​ మొదలుపెట్టాడు. అయితే ఆ రోజుల్లో అంటే... 2008లో సస్టెయినబిలిటీ గురించి అంతగా ఎవరికీ తెలియదు. అదీకాక ఐఐటిలో చదువుకున్న ఇతనేంటి చెత్త బాటిల్స్​ కలెక్ట్​ చేస్తున్నాడని విచిత్రంగా చూసేవారు. ఆ పరిస్థితుల్లో తమిళనాడులోని వేరువేరు ప్రాంతాల నుంచి వేస్ట్​ సేకరించడం కష్టంగా ఉండేది ఆయనకు. ఆ బిజినెస్​ అప్పుడు అంత సక్సెస్​ కాలేదు. కానీ ఆయన దాన్ని వదిలిపెట్టలేదు. అప్పుడు నేను స్కూల్​లో చదువుకుంటున్నా. మా అమ్మ కూడా ఐఐటీలో చదివింది​. ఆమే మా కుటుంబ భారాన్ని మోసేది. నేను ఇంజినీరింగ్​ డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ‘నా కొడుకు మంచి ఉద్యోగంలో చేరాలి’ అనుకున్నాడట మా నాన్న.

నాది ఆ అభిమానం కాదు

నాతోటి వాళ్లంతా గ్రాడ్యుయేషన్​ తరువాత విదేశాల్లో స్థిరపడ్డారు. కానీ నేను మాత్రం విదేశాల్లో సెటిల్​ కావాలి అనుకోలేదు. అక్కడికెళ్లి విదేశీ ప్రభుత్వాలకు ట్యాక్స్​లు కట్టడం నచ్చలేదు. నా దేశాభిమానం క్రికెట్​ మ్యాచ్​లు చూసి చప్పట్లు కొట్టి సరిపెట్టుకునేది కాదు. నా దేశానికి నేనేదైనా తిరిగి ఇవ్వాలనుకున్నా. మూడేండ్లు ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేశా. కానీ అందులో తృప్తి అనిపించలేదు. ఆ ఉద్యోగం మానేశా. మా నాన్న నడుపుతున్న ‘శ్రీ రెంగ పాలిమర్స్​ కంపెనీ’తో కలిసి ఎకోలైన్​ పేరిట సస్టెయినబుల్​ ఫ్యాషన్​ క్లోతింగ్​ బ్రాండ్​ను 2021లో మొదలుపెట్టా.  పెట్​ బాటిల్స్​ వాడి క్లోత్స్​ తయారుచేస్తున్నాం. పెట్​ బాటిల్స్​ డిగ్రేడ్​ కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. అదే ఈ పెట్​ బాటిల్స్​తో సస్టెయినబుల్​ క్లోతింగ్​ తయారుచేస్తే భూమ్మీద చెత్తగా చేరేందుకు కొంత టైం పడుతుందనే ఆలోచనే నన్ను క్లోతింగ్​ వైపు నడిపించింది.

జీతాలకి లోన్లు...

నిజానికి పెద్ద వ్యాపారం చేయాలని చెన్నయ్​లోని ఒక పాత బట్టల మిల్లు కొనాలనుకున్నాం మొదట్లో. ఆ కంపెనీ నడిపేంత డబ్బు చేతిలో లేదు. దానివల్లే మేం అనుకున్న ప్లాంట్​ పెట్టడానికి ఏడాది టైం పట్టింది. కంపెనీ మొదలుపెట్టాక కూడా జీతాలు ఇవ్వడానికి లోన్స్​ తీసుకున్నాం. మా పని మీద నమ్మకంతో మా ఉద్యోగులు కూడా కొంత ఇన్వెస్ట్​ చేశారు. వాళ్లు మమ్మల్ని అంతగా నమ్మడం గర్వంగా అనిపిస్తుంది. మమ్మల్ని నమ్మిన వాళ్లు ఇప్పటికీ మాతోనే ఉన్నారు. టెక్స్​టైల్​ వాల్యూ చెయిన్​ అనేది కాంప్లెక్స్​గా ఉంటుంది. మేం ఒక మురికి ప్లాస్టిక్​ బాటిల్​ను ప్రెట్టీ గార్మెంట్​గా మారుస్తున్నాం.
గత ఐదేళ్లలో ఎకోలైన్​ క్లోతింగ్​ ద్వారా81 లక్షల పెట్​ బాటిల్స్​ నేలలోకి, సముద్రాల్లోకి చెత్తలా పేరుకుపోకుండా చేయగలిగాం. ఈ క్లోతింగ్​ గురించి విన్నప్పుడు ‘ప్లాస్టిక్​ వేస్ట్​నుంచి తయారుచేసిన బట్టల్ని ఎలా వేసుకుంటాం’ అని పెదవి విరుస్తారు చాలామంది. ఆ మైండ్​సెట్​ మార్చాలనేదే మా ప్రయత్నం. అందుకోసమే అందరూ ఇష్టపడేలా జాకెట్స్​, బ్లేజర్స్​, టీ–షర్ట్స్, బాటమ్స్​ వంటి ఫ్యాషన్స్​ తయారుచేస్తున్నాం. మా వెబ్​సైట్​లో, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, అజియో వంటి ఇ–కామర్స్​ పోర్టల్స్​లో ఎకోలైన్​ క్లోతింగ్ అందుబాటులో ఉంది.

నీళ్లు లేకుండా డైయింగ్​

నిజానికి కన్వెన్షల్​ డైయింగ్​ పద్ధతిలో అయితే టెక్స్​టైల్​ డైయింగ్​కు ఒక్కో ఏడాదికి 2.4 ట్రిలియన గ్యాలన్ల నీరు అవసరం పడుతుంది. అంతనీరు వాడకుండా మేం డోప్​ డై టెక్నాలజీ వాడుతున్నాం. దానివల్ల ఒక్క చుక్క నీరు అవసరం లేకుండా డైయింగ్​ ప్రాసెస్​ జరిగిపోతుంది. కన్వెన్షనల్​ మెథడ్​లో నీళ్ల అవసరం ఎందుకు వస్తుందంటే... యార్న్​ తయారుచేశాక డై చేస్తారు. దాన్ని శుభ్రం చేసేందుకు నీళ్లు అవసరం అవుతాయి. డోప్​ డైయింగ్​ పద్ధతిలో పెట్​ బాటిల్స్​ నుంచి పాలియెస్టర్​ తయారయ్యేటప్పుడే రంగు కలిపేస్తాం. దానివల్ల ఫైబర్​కు రంగు వేసేందుకు విడిగా నీరు అవసరం పడదు. ఈ టెక్నాలజీని ఇండియాలో చాలా కంపెనీలే వాడుతున్నాయి. అయితే మా ఒక్క కంపెనీనే ఎండ్​ ప్రొడక్ట్​కు ఈ పద్ధతి వాడుతోంది.

ప్రధాని వేసుకున్నాక...

ఫిబ్రవరి 2023లో మా బ్రాండ్​కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మేం తయారుచేసిన నీలం రంగు సడ్రి జాకెట్​ వేసుకుని పార్లమెంట్​కు వెళ్లారు. ఆ జాకెట్​ను 25 పెట్​ బాటిల్స్​ వాడి తయారుచేశాం. పార్లమెంట్​కే కాకుండా జపాన్​, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు కూడా ప్రధాని ఈ జాకెట్​ వేసుకున్నారు. అలా జాతీయంగా, అంతర్జాతీయంగా మేం చేసిన హార్డ్​వర్క్​కు బ్రాండ్​ వాల్యూ వచ్చింది. ప్రధాని వేసుకున్న తరువాత మా సేల్స్​లో 25 శాతం పెరుగుదల కనిపించింది. మేం తయారుచేసే క్లోతింగ్​​ 500 నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉంది. నెలకి 20,000 ఆర్డర్లు చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా ఎకోలైన్​ వార్షికాదాయం రూ12 కోట్లు.

అదే పెద్ద ఛాలెంజ్​

మా ఎదురుగా ఉన్న ఛాలెంజ్​ ఏంటంటే వినియోగదారుల మైండ్​సెట్​ మార్చడం. ఇవ్వాళ రేపు లగ్జూరీయస్​, ఎక్కువ రేటు ఉన్న బట్టలు వేసుకోవడం స్టేటస్​ సింబల్​ అనుకుంటున్నారు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాష్​ నుంచి తయారుచేసిన  ప్రొడక్ట్​ వాడమని అడగడం కాస్త కష్టమైన పనే కదా! అయినప్పటికీ తక్కువ టైంలోనే ఆ మైండ్​సెట్​ మార్చగలం అనుకుంటున్నాం.
ఎంట్రప్రెనూర్​షిప్​ వల్ల పేరు, డబ్బు రావడమే కాదు. సమాజానికి, పర్యావరణానికి ఎంతోకొంత నేను కూడా ఇచ్చే అవకాశం కలిగింది. సముద్రంలోకి, భూమ్మీద కొన్ని లక్షల పెట్​ బాటిల్స్​ చెత్తగా పేరుకుపోకుండా చేయగలుగుతున్నా. కొన్ని వేల మంది చెత్త ఏరుకునేవాళ్లకు ఆర్థికసాయం చేయగలుగుతున్నా. నేను ఏ ఎమ్మెన్సీలోనే పనిచేస్తుంటే ఇప్పుడు నాకు దొరికిన ఆత్మసంతృప్తి దొరికేది కాదు. మా నాన్నకు మల్లే నేను కూడా ఉద్యోగం వదిలేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ఈ రోజున గర్వ పడుతున్నా” అని ముగించాడు.

పెట్​ బాటిల్​ నుంచి పాలియెస్టర్​​

పెట్​ బాటిల్స్​ను సేకరించి మాకు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో మొత్తం 50,000 మంది చెత్త ఏరే వాళ్లతో నెట్​వర్క్​ ఏర్పాటుచేసుకున్నాం. అలా సేకరించిన బాటిల్స్​ను క్యూబ్స్​గా కంప్రెస్​ చేసి మాకు సప్లయ్​ చేస్తారు. మేము వాటి క్యాప్స్​, ర్యాపర్స్​ వేరు చేస్తాం. ఆ తరువాత పెట్​ బాటిల్స్​ను క్రష్​ చేసి 3–8 ఎం.ఎం సైజ్​ ఫ్లేక్స్​గా చేస్తాం. ఈ ఫ్లేక్స్​లో తేమను తీసేందుకు డ్రై చేస్తాం. ఆ తరువాత ఫ్లేక్స్​ను 300 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి ఫైబర్​గా మార్చి చల్లబరుస్తాం. ఆ తరువాత పాలియెస్టర్​ ఫైబర్​ను మెటీరియల్ ​నుంచి వేరుచేసి ఆ ఫైబర్​ను యార్న్​గా చేస్తాం. అలా బట్టలు కుట్టే ఫ్యాబ్రిక్​ తయారవుతుంది. తరువాత దాన్ని ఫ్యాషనబుల్​ గార్మెంట్స్​గా కుడతాం. ఒక టీ షర్ట్​ తయారుచేసేందుకు ఎనిమిది పెట్​ బాటిల్స్​ పడతాయి. అదే జాకెట్​కి అయితే 20 బాటిల్స్​,  బ్లేజర్​ తయారీకి 30 బాటిల్స్​ అవసరం.

‘‘దేశంలో ఉన్న వనరులన్నీ వాడుకుని, దేశానికి తిరిగివ్వాల్సిన టైంకి విదేశాలకి వెళ్లిపోతున్నారనేది నా అభిప్రాయం. నేను అలా చేయాలనుకోలేదు. అందుకే ఇక్కడే ఉండి నా దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడాలి అనుకున్నా.

నేను పనిచేస్తున్న రంగం​లోనే నా కొడుకు కూడా రావడం అనేది మంచి విషయం. ఒక కాజ్​ కోసం నా కంపెనీ పనిచేయడం అనేది నాకు చాలా తృప్తినిస్తోంది.

కె. శంకర్​