ఈస్ట్ అజర్​బైజాన్ ప్రావిన్స్​లో ఉన్న పురాతన ఊరు ఇది

ఈస్ట్ అజర్​బైజాన్ ప్రావిన్స్​లో ఉన్న పురాతన ఊరు ఇది

మనుషులకు ఇళ్లలాగే పక్షులకు గూళ్లు, జంతువులకు గుహలు, పాములకు పుట్టలు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇక్కడ పుట్టల్లాంటి నిర్మాణాలు ఒక్కసారి గమనించండి. కిటికీలు, తలుపులు కనిపిస్తున్నాయా! అవన్నీ మనుషులు ఉండే ఇండ్లు. మరయితే అలా కట్టుకున్నారేంటి? అనుకుంటున్నారా... అయితే ఇది చదవండి.

ఇరాన్​లోని ఈస్ట్ అజర్​బైజాన్ ప్రావిన్స్​లో ఉన్న పురాతన ఊరు ఇది. పేరు కందొవన్. ఈ ఊళ్లో ఇండ్లన్నీ పుట్టల్లానే కనిపిస్తాయి. కానీ.. దగ్గరికి వెళ్లి చూస్తే వాటికి తలుపులు, కిటికీలు ఉంటాయి. అంతేకాదు.. ఈ ఇండ్లలో రెండు మూడు అంతస్తులు కూడా ఉన్నాయి. పై అంతస్తుకు వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. ఇలాంటి ఆర్కిటెక్చర్​ ఎక్కడా చూసుండరు. ఒకవేళ దీన్ని చూసి ఇన్​స్పైర్​ అయ్యి కట్టాలనుకున్నా.. ఇంజినీర్​లకు పెద్ద టాస్కే. అందుకే ఈ ఊరు ఆర్కిటెక్చర్​తోనే ఫేమస్ అయింది. అక్కడివాళ్లు వీటిని ‘కరన్​’ అని పిలుస్తారు. అంటే.. తేనెతుట్టె నిర్మాణాలు అని అర్థం. ఇవి పగలేమో కొండల్లా లేదా పుట్టల్లా, దూరం నుంచి చూస్తే తేనెతుట్టెల్లా కనిపిస్తాయి. రాత్రిపూట మాత్రం లైట్ల వెలుగులో.. చాలా అందంగా కనిపిస్తుంది కందొవన్. 

ఇంత వెరైటీగా కట్టుకున్నారు సరే.. మరి అందులో ప్రజలు ఉండేందుకు అనుకూలంగా ఉంటుందా? అనే డౌట్ వచ్చింది కదా. మన ఇండ్లలో మనం ఎంత సౌకర్యవంతంగా ఉంటున్నామో.. వాళ్లు కూడా అలానే ఉంటారు. పైగా వాళ్ల ఇండ్లలో హీటర్, ఫ్యాన్, ఏసీల్లాంటివి ఏవీ ఉండవు. ఎందుకంటే ఆ ఇండ్లు చలికాలం వెచ్చగా, వేసవి కాలం చల్లగా ఉంటాయి. మనిషి ప్రశాంతంగా బతకడానికి ఇంతకంటే ఏం కావాలి! అంతేకాకుండా... ఇక్కడ జనాభా చాలా తక్కువ. 2006 జనాభా లెక్కల ప్రకారం160 పైగా కుటుంబాలు అక్కడ ఉండేవి. ప్రస్తుతం దాదాపు వంద కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి ఇరుగుపొరుగు వాళ్లతో గొడవలు తక్కువే. ఈ ఊళ్లో వీధులుంటాయి కానీ.. రోడ్డు సరిగా ఉండదు. ఇండ్లు కొండల మీద ఉంటాయి. కాబట్టి పక్క వీధికి వెళ్లాలంటే మెట్లు ఎక్కాలి. లేదా నిటారుగా ఉండే దారిలో నడిచి వెళ్లాలి. ఆ దారుల్లో నడవడం అక్కడివాళ్లకు ఈజీనే. కానీ, కొత్తగా వెళ్లినవాళ్లకి మాత్రం కొంచెం కష్టం. అంటే.. వెహికల్స్ ఉండవు కాబట్టి వాయు, శబ్ద కాలుష్యాలు ఉండవు. ఈ ఊళ్లో ఒక వెరైటీ సంప్రదాయం ఉంది. దాని ప్రకారం... పెండ్లికి ముందే అబ్బాయిలు ఇల్లు కట్టుకోవాలి. ఆ తర్వాతే పెండ్లి చేసుకోవాలి. 

సంపాదనకు కొదువ లేదు

కందొవన్ ప్రజలు చేత్తో తయారుచేసిన బొమ్మలు, వస్తువుల్ని అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. మంచి క్వాలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉత్పత్తి చేస్తారు. రంగు రంగు దారాలతో ట్రెడిషనల్ డిజైన్లతో కార్పెట్లు అల్లుతారు. వాటిని కిలిం, జజిం కార్పెట్లు అంటారు. వాటితోపాటు, ఆడవాళ్లు తలకు కట్టుకునే స్కార్ఫ్​ ‘కలఘై’ వంటివి తయారుచేసి అమ్ముతారు. అంతేకాదు.. ఇక్కడ మినరల్ వాటర్​కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ నీళ్లు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని చెప్తారు వాళ్లు. ఈ మధ్యకాలంలో టూరిస్ట్​ డెస్టినేషన్​గా మారింది కందొవన్. దాంతో హోటల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. టూరిస్ట్​లు బస చేసేందుకు వసతులు కల్పించడం ద్వారా కూడా సంపాదిస్తున్నారు. 

ఏడు శతాబ్దాల నుంచి..

ఇక్కడి ప్రజలు గత 700 ఏండ్లుగా ఈ ఇండ్లలో నివసిస్తున్నారు. వీళ్లంతా ఇక్కడికి ఎందుకొచ్చారంటే.. కందొవన్ ‌‌కు పశ్చిమాన రెండు కిలోమీటర్ల దూరంలో హిలేవర్ గ్రామం ఉంది. మంగోలియన్ల దాడి నుంచి తప్పించుకోవడానికి కందొవన్ దగ్గర్లోని మైదానానికి వాళ్లంతా వలస వచ్చారట. ఈ ప్రదేశానికి వచ్చిన మొదటి సమూహం వాళ్లే అని చెప్పుకుంటారు. అలా వచ్చిన వాళ్లు తలదాచుకోవడానికి కరన్​లు తవ్వారట. దండయాత్ర చేస్తున్న మంగోలియన్ల నుంచి తప్పించుకోవడానికి పూర్వీకులు అగ్నిపర్వత శిలలను తవ్వి నివాసంగా చేసుకున్నారని పరిశోధకులు చెప్పారు. ఈ ఇండ్లు చూడటానికి చాలా వింతగా కనిపించినా చాలా సౌకర్యంగా ఉంటాయి. అందుకనే ఆ ఇండ్లలో ఉండడానికి ఇబ్బంది పడరు వాళ్లు.

žప్రత్యేకతలు

కందొవన్​ ప్రజలు ట్రాన్స్​పోర్ట్ కోసం గాడిదలను ఉపయోగిస్తారు. వాళ్ల సామానులు లేదా అమ్మే వస్తువుల్ని మూట కట్టి, వాటిని గాడిదల మీద వేస్తారు. అవి పడిపోకుండా తాళ్లతో కట్టి, వాళ్లు కూడా గాడిద మీద ఎక్కి వెళ్తారు. కందొవన్​లోనే కాదు.. ఇరాన్​ దేశమంతటా ట్రాన్స్​పోర్ట్​ కోసం గాడిదల్ని  బాగానే వాడతారు. ఇరాన్​లో శీతాకాలంలో చలి ఎక్కువే. అందుకే ఒంటె బొచ్చుతో టోపీలు తయారుచేస్తారు. అక్కడి ఒంటెల బొచ్చు గొర్రె బొచ్చులా ఉంటుంది. దాంతో వాళ్లు ఆ బొచ్చుని ఎండబెట్టి, దారపు పోగులు తయారుచేస్తారు. వాటిని టోపీలుగా తయారుచేసి అమ్ముతారు. టోపీలే కాదు.. చలికాలం ఉపయోగపడే స్వెటర్లు, శాలువాలు వంటివి కూడా ఈ బొచ్చుతో తయారుచేస్తారు. 
ఇరాన్ లేదా కందొవన్​లలో స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది. ఆ తేనె కోసం అక్కడి వాళ్లు తేనెటీగల పెంపకం చేస్తారు. అలా పెంచిన తేనె తుట్టెల నుంచి తేనెను నేరుగా గాజు సీసాల్లోకి తీస్తారు. ఏ సీజన్​లో వెళ్లినా మార్కెట్లో తేనె సీసాలు రెడీగా ఉంటాయి.

ఎలా వెళ్లాలి?

సబలన్ శిఖరంలో సుల్తాన్ దఘీ అనే భాగం మీద ఉంది కందొవన్ గ్రామం. అంటే అజర్​బైజాన్ రాజధాని తబ్రిజ్​ సిటీకి చాలా దగ్గరన్నమాట. అక్కడి నుంచి కారు లేదా మినీ బస్సులో దాదాపు ఒక గంటలో కందొవన్ చేరుకోవచ్చు. లేదంటే.. తబ్రిజ్​ నుంచి రైల్లో ఓస్కు పట్టణం వెళ్లి, అక్కడి నుంచి కారులో 20 నిమిషాలు జర్నీ చేయాల్సి ఉంటుంది.