మేడిగడ్డ కుంగుబాటుకు నిర్లక్ష్యమే కారణం.!

మేడిగడ్డ కుంగుబాటుకు నిర్లక్ష్యమే కారణం.!
  •     దానికి రక్షణగా పెట్టిన షీట్ ఫైల్స్​అట్లనే వదిలేసిన్రు
  •     మెయింటనెన్స్​ను పట్టించుకోలే.. కనీస జాగ్రత్తలు తీసుకోలే
  •     ఫలితంగా భారీ నష్టం.. ప్రశార్థకంగా ప్రాజెక్టు ఉనికి
  •     ఇదే అంశంపై ఇరిగేషన్​సర్కిల్స్​లో జోరుగా చర్చ
  •     పదికి పైగా పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ కట్టాల్సిందే.. 
  • అందుకు సుమారు రూ.650 కోట్ల ఖర్చు!

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగుబాటుకు అంతులేని నిర్లక్ష్యమే కారణమనే చర్చ  ఇరిగేషన్​ సర్కిల్స్​లో జోరుగా సాగుతున్నది. బ్యారేజీతో పాటు ప్రధాన పంప్​హౌస్​కన్నెపల్లిని త్వరగా పూర్తి చేయడం, ప్రారంభించడంపై చూపించిన శ్రద్ధను నిర్వహణలో చూపించకపోవడంతోనే నాలుగేండ్లకే బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని ఇంజనీర్లు చెప్తున్నారు. పొరపాట్లు, నిర్లక్ష్యమే ఇప్పుడు వందల కోట్ల రూపాయల నష్టానికి కారణంగా మారుతున్నాయని, ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయని అనుమానిస్తున్నారు. బ్యారేజీ నిర్మించిన వర్క్​ఏజెన్సీతో పాటు ఫీల్డ్​ఇంజనీర్లు కనీస జాగ్రత్తలు తీసుకోకవడంతోనే మేడిగడ్డ ఏడో బ్లాక్​కుంగిందని.. ఆ ప్రభావం ఆరు, ఎనిమిది బ్లాకులపైనా పడిందని ఇరిగేషన్​ఇంజనీర్లు, రిటైర్డ్​ఇంజనీర్లు భావిస్తున్నారు. బ్యారేజీ నిర్మించడానికి ముందు కట్టిన కాఫర్​డ్యామ్​పూర్తిగా తొలగించకపోవడం, దానికి దిగువన ఏర్పాటు చేసిన షీట్​ఫైల్స్​ను అలాగే వదిలేయడంతోనే ఏడో బ్లాక్​లో అండర్​మైనింగ్​జరిగి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినట్లు చెప్తున్నారు. ఈ విషయం అధికారికంగా బయటపెట్టకపోయినా..  ఆఫ్​ది రికార్డుగా ప్రస్తావిస్తున్నారు. సాంకేతిక కారణాలతో బ్యారేజీ కుంగినట్టు కొత్త ప్రభుత్వానికి చెప్తూ తమ తప్పు ఏమీలేదని బుకాయించేందుకు ఫీల్డ్​ఇంజనీర్లతో పాటు వర్క్​ఏజెన్సీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.  

ఇసుక కొట్టుకుపోయి..!

మేడిగడ్డ బ్యారేజీ నిర్మించడానికి ముందు గోదావరి నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు నదిలో కాఫర్​డ్యాం కట్టారు.  గోదావరి ప్రవాహ తీవ్రతకు కాఫర్​డ్యాం దెబ్బతినకుండా ఉండేందుకు నదిలో 5 మీటర్ల లోతు నుంచి కాఫర్​డ్యాం దిగువన షీట్​ఫైల్స్​ఏర్పాటు చేశారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత కాఫర్​డ్యాంను పూర్తిగా తొలగించలేదు. ముఖ్యంగా పిల్లర్​కుంగిపోయిన ఏడో బ్లాక్​కు ఎగువన కాఫర్​డ్యాంను అలాగే వదిలేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదో బ్లాక్​లో కాఫర్​డ్యాం కింద ఏర్పాటు చేసిన షీట్​​ఫైల్స్​ను అలాగే వదిలేశారు. దీంతో గోదావరి ప్రవాహానికి అవి అడ్డు తగిలి ఇంకా ఎక్కువ తీవ్రతతో బ్యారేజీ ముందు భాగాన్ని వరద తాకిందని, ఆ కారణంగానే సికెంట్​ఫైల్స్​ఫెయిలై ఫౌండేషన్​కింద అండర్​ మైనింగ్​అయి ఇసుక కొట్టుకుపోయిందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించకపోవడం.. కాఫర్​డ్యాం, షీట్​ఫైల్స్​చేసే నష్టాన్ని సరిగా అంచనా వేయకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏడో బ్లాక్​లో 20వ నంబర్​పిల్లర్​ఎందుకు కుంగిందో ఇన్వెస్టిగేట్​చేయడానికి కాఫర్​డ్యాం నిర్మిస్తున్నారు. పాత కాఫర్​డ్యాంపైనే కొత్త అప్రోచ్​రోడ్డు కం కొత్త కాఫర్​డ్యాం కడ్తున్నారు. ముఖ్యంగా 18 నుంచి 20వ నంబర్​పిల్లర్లకు ఎగువన పాత కాఫర్​డ్యాం ఎక్కువ ఎత్తులోనే కనిపిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీలోని ఆరు నుంచి ఎనిమిది బ్లాకులు మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఇసుక తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని.. అందుకే కాఫర్​డ్యాం తొలగించలేదని కొందరు ఫీల్డ్​ ఇంజనీర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బ్యారేజీలో పేరుకుపోయిన ఇసుక తొలగించడం వేరు.. బ్యారేజీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కాఫర్​డ్యాంను తొలగించడం వేరే అనే లాజిక్​మరిచి ఇంజనీర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని డిపార్ట్​మెంట్​లోనే చర్చ జరుగుతున్నది. 

మిగతా పిల్లర్లలోనూ పగుళ్లు

బ్యారేజీ మిగతా బ్లాకుల్లోని కొన్ని ప్రాంతాల్లో పాత కాపర్​​డ్యాం ఆనవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మేడిగడ్డ వైఫల్యాలపై పవర్​పాయింట్​ప్రజంటేషన్​లో మూడు పిల్లర్లు, రేడియల్​గేట్లు, స్లాబ్, వాక్​వే బ్రిడ్జి సహా అన్నింటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామని ఇరిగేషన్​ఈఎన్సీ చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యారేజీలోని ఏడో బ్లాక్​లో గల 16వ నంబర్​నుంచి 21వ నంబర్​పిల్లర్​వరకు దెబ్బతిన్నాయి. 20వ నంబర్​పిల్లర్​1.25 మీటర్లు కుంగడంతో దానిలో పగుళ్లు ఏర్పడ్డాయి. మిగతా పిల్లర్లలోనూ చిన్నపాటి పగుళ్లు ఉన్నాయి. ఏడో బ్లాక్​కు ఇరువైపులా ఉన్న ఆరు, ఎనిమిదో బ్లాకుల్లోని కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నా తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పదికి పైగా పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని, ఇందుకు సుమారు రూ.650 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్వహణలో కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకొని, ఏటా దెబ్బతిన్న ఆప్రాన్​లు సహా ఇతర మైనర్​రిపేర్లు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఇంజనీర్లు  చెప్తున్నారు. ఇందులో వర్క్​ఏజెన్సీ నిర్లక్ష్యం ఎంత ఉందో ఫీల్డ్​ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం అంతకన్నా ఎక్కువే ఉందని అంటున్నారు.  బ్యారేజీ పునరుద్ధరించడం ఎంత ముఖ్యమో.. దాని నిర్వహణపై శ్రద్ధ తీసుకోవడం అంతకన్నా ముఖ్యమని, ఆ దిశగా కొత్త ప్రభుత్వమైన దృష్టి సారించాలని సూచిస్తున్నారు.