కండలు పెంచే తిండి కాదు.. కొవ్వు పెంచే తిండి తింటున్నారు

కండలు పెంచే తిండి కాదు.. కొవ్వు పెంచే తిండి తింటున్నారు
5వ జాతీయ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడి తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఒబేసిటీ సమస్య పట్నం-పల్లె మధ్య తగ్గిపోతున్న తేడా శ్రమకు మించి తినేవాళ్లు పెరిగిపోతున్నారు ‘తిండి  కలిగితె కండకలదోయ్​’ అన్నాడు గురజాడ. అయితే మనవాళ్లు కండలు పెంచే తిండి కాకుండా కొవ్వు పెంచే తిండి తింటున్నారిప్పుడు. ఆ తిండితో గట్టిమేల్​ తలపెట్టే ఓపిక లేకపోగా రోగాలబారిన పడుతున్నారు. ఇది ఎవరో అన్న ఉత్తమాట కాదు. ‘నేషనల్​ హెల్త్​ సర్వే’ చెప్పిన గట్టిమాట. తెలంగాణలో ఏటా ఒబెసిటీ ప్రాబ్లమ్​తోపాటు రక్త హీనతతో బాధపడుతున్నవాళ్లు పెరుగుతున్నారని లెక్కగట్టి చెబుతున్నది. మొన్ననే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన 5వ నేషనల్​ హెల్త్​ సర్వే రిపోర్ట్​ తెలంగాణలో ఒబెసిటీ సమస్య పెరుగుతున్నదని తేల్చి చెప్పింది. చేసే పనికి మించిన తిండి తినడం ఒక సమస్య అయితే, తినే తిండి కూడా ఒంట్లో కొవ్వు పెంచేదే కావడంతో ఈ సమస్య ఎక్కువవుతోంది. తెలంగాణలో 19 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు వాళ్లలో ఈ సమస్య గత సర్వే (4వ నేషనల్​ హెల్త్​ సర్వే) లెక్కల కంటే ఎక్కువగా ఉంది. తాజా నివేదిక ప్రకారం తెలంగాణ ఆడవాళ్లలో 44.1 శాతం మంది ఒబెసిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్లలో 46.1 శాతం మంది ఒబెసిటీ బారినపడ్డారు. ఒబెసిటీ సమస్య అర్బన్, రూరల్​ ప్రాంతాల్లో దాదాపు సమానంగా ఉంది. అర్బన్​ మహిళల్లలో 47.5 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతుంటే, రూరల్​లో ఉండే మహిళల్లో 42.3 శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్లలో కూడా పట్నం, పల్లె అనే తేడా తగ్గిపోయినట్లుంది. అర్బన్​ ఏరియాలో ఉండే మగవాళ్లలో 47.6 శాతం మంది ఒబెసిటీతో ఇబ్బంది పడుతుంటే రూరల్​ ఏరియాలో ఉండేవాళ్లలో 45.3 శాతం మంది ఈ సమస్యతో ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం కూర్చుని ఉండే పనులు చేసేవాళ్లు, పని చేయని వాళ్లు, శ్రమకు మించి తినేవాళ్లు పల్లెల్లో కూడా పెరిగిపోతున్నారని అర్థమవుతోంది.