శరవేగంగా ఖమ్మం అభివృద్ధి: మంత్రి కేటీఆర్

శరవేగంగా ఖమ్మం అభివృద్ధి: మంత్రి కేటీఆర్
  • రూ.1360  కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 
  • ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆప్తుడు 

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలో రూ.1360  కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  శనివారం ఉదయం10 గంటలకు హెలీకాప్టర్‌‌ ద్వారా ఖమ్మం నగరానికి మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఆయన పర్యటన ఆద్యంతం హడావిడిగా సాగింది.  ముందుగా లకారం ట్యాంక్‌‌బండ్‌‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌‌టీఆర్‌‌ పార్కును ప్రారంభించారు.  అనంతరం రూ.10 కోట్లతో  నగరంలో చేపట్టనున్న  అండర్‌‌గ్రౌండ్‌‌ డ్రైనేజ్‌‌, మరో రూ.2.49 కోట్లతో అమృత్‌‌ 2.0 అండర్‌‌ గ్రౌండ్‌‌ డ్రైనేజ్‌‌  నిర్మాణం పనులకు, శంకుస్థాపనలు చేశారు.  

20వ డివిజన్‌‌ ఎస్‌‌బిఐటి ఇంజనీరింగ్‌‌ కళాశాల రోడ్దు వద్ద రూ.71 లక్షలతో స్పోర్ట్స్‌‌ పార్క్‌‌ (టర్ప్​కోర్టు), ప్రకాశ్‌‌నగర్‌‌లో ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ పార్క్ లో  రూ. 108.71 కోట్లతో నిర్మించిన అండర్‌‌గ్రౌండ్‌‌ డ్రైనేజ్‌‌ పైప్‌‌లైన్‌‌, వర్షపు నీరు తరలించే పనులను, వీడీఓస్‌‌ కాలనీ వద్ద రూ.8.54 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌‌ వెజ్‌‌ అండ్‌‌ నాన్‌‌వెజ్‌‌ మార్కెట్‌‌ను  ప్రారంభించారు.  కాల్వఒడ్డు వద్ద రూ.690.52 కోట్లతో నిర్మించనున్న మున్నేరు ఆర్‌‌సీసీ రక్షణ గోడల నిర్మాణ పనులకు, మున్నేరు వద్ద రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్‌‌ బ్రిడ్జ్‌‌ నిర్మాణ పనులకు, గట్టయ్య సెంటర్‌‌ నగరపాలక సంస్థ ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు, టీయుఎఫ్‌‌ఐడీసీ నిధులు రూ.100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

మహానుభావుడు ఎన్టీఆర్

సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..   ఖమ్మం నగరం అన్ని రంగాల ప్రగతిలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  తెలుగు రాష్ట్రాలతో పాటు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎంతో ఆప్తుడు  నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.  ఈ  అవకాశం కల్పించిన మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌కు ధన్యవాదాలు తెలిపారు.  మంత్రి కేటీఆర్ అధికారిక షెడ్యూల్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్లాల్సి ఉండగా, భారీ వర్షం కారణంగా వాయిదా వేసుకుని తిరిగి హెలీప్యాడ్ లో హైదరాబాద్ వెళ్లిపోయారు. 

కార్యక్రమాల్లో ఖమ్మం పార్లమెంట్‌‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్‌‌, జిల్లా కలెక్టర్‌‌ వీపీ. గౌతమ్‌‌, పోలీసు కమిషనర్‌‌ విష్ణు.యస్‌‌.వారియర్‌‌, జిల్లా పరిషత్‌‌ చైర్మన్‌‌ లింగాల కమలరాజు, నగర మేయర్‌‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌‌ బచ్చు విజయ్‌‌కుమార్‌‌, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ దొరెపల్లి శ్వేత, డీసీసీబి చైర్మన్‌‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌‌ రాయల శేషగిరిరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌‌ ఆదర్శ్‌‌ సురభి, శిక్షణ అసిస్టెంట్‌‌ కలెక్టర్‌‌ మయాంక్‌‌సింగ్‌‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గోద్రెజ్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అభినందనలు 

అంజనాపురంలో గోద్రెజ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ తో పాటు..   పువ్వాడ అజయ్‌‌ కుమార్, ఎంపీలు వద్ది రాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డి శనివారం భూమి పూజలో పాల్గొన్నారు.  ఈ  ఫ్యాక్టరీ నిర్మాణంతో 300 మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వనున్న యాజమాన్యాన్ని కేటీఆర్ అభినందించారు.   పామాయిల్ పెంపకం ద్వారా ఎకరాకు రూ. 1. 20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల ఆదాయాన్ని రాబట్టుకోవచ్చన్నారు. 

రాములన్నను గుండెల్లో  పెట్టుకొని కాపాడుకుంటా: మంత్రి కేటీఆర్‌‌‌‌

వైరా, వెలుగు:  కాంగ్రెస్ ఒక 420 పార్టీ అని ఆ పార్టీకే గ్యారెంటీ లేదని.. ప్రజలకు వారు ఏం గ్యారెంటీ ఇస్తారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని  కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు రూ. 2.50 కోట్లతో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  అవకాశం రాకపోతే పార్టీలు మార్చే నాయకులు మనకు వద్దని, నియోజకవర్గంలో టికెట్ రాకపోయినా రాములన్న మనకి గ్యారెంటీగా నిలిచారని ఇలాంటి వారిని నమ్మాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మానవతావాదని ప్రశంసించారు. 

రాములు నాయక్  వైరా ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు.   కొన్ని కారణాల వల్ల వైరా టికెట్‌‌ను మదన్ లాల్‌‌కు కేటాయించామని చెప్పారు.  తనకు టికెట్టు, పదవులు శాశ్వతం కాదని, గిరిజనులకు ప్రభుత్వం 10% రిజర్వేషన్ అమలు చేయటం చారిత్రాత్మకమని ఆయన చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎమ్మెల్యే  రాములన్న లాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారన్నారు.   రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కొంతమంది అవకాశవాదులు వస్తున్నారని వారి మాటలను నమ్మొద్దన్నారు.  ఖమ్మం వైరా నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనే  ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.  కాంగ్రెస్ ఇచ్చిన రెండు వందల పింఛన్‌‌ను రూ. 2 వేలు చేసిన ఘనత కేసీఆర్‌‌‌‌దేనన్నారు.