
మంథని, వెలుగు: మంథనిలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని, ముత్తారం మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని గర్ల్స్ పాఠశాల లో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను ప్రారంభించారు.
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రూ.1.28 కోట్లతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశంలోనే అడవి శ్రీరాంపూర్‌ను ఏఐ గ్రామంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామంలోని 1105 ఇండ్లకు టీ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలందిస్తున్న మంచు లక్ష్మి, ప్రతినిధులను మంత్రి అభినందించారు. మంథని నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్లు అన్నయ్య గౌడ్, కోట రాజబాపు, లీడర్లు చొప్పరి సదానందం, బాలాజీ, యాదగిరిరావు, కుమార స్వామి, అధికారులు పాల్గొన్నారు.