అధికారుల సొంత అవసరాలకు దారి మళ్లింపు!

అధికారుల సొంత అవసరాలకు దారి మళ్లింపు!
  • ఫిర్యాదులతో విజిలెన్స్ విచారణ ప్రారంభం
  • జమ చేయని డీడీలు, నగదు గుర్తింపు
  • వివాదాలకు కేంద్రంగా డీటీవో

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట డిస్ట్రిక్ట్​ ట్రాన్స్​ఫోర్ట్​ ఆఫీస్ (డీటీవో)లో డీడీలను రిసైక్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాహనదారులు చెల్లించిన పన్నులను కొందరు అధికారులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రెండు రోజుల కింద సిద్దిపేట డీటీవో లో విజిలెన్స్ తనిఖీల నేపథ్యంలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కింద ఓ వ్యక్తి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ తో పాటు చీఫ్​ సెక్రటరీ, హై కోర్టు చీఫ్​ జస్టిస్ కు సిద్దిపేట డీటీవోలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో సిద్దిపేట డీటీవో నుంచి టార్గెట్​ మేరకు ఆదాయం రాకపోవడాన్ని గుర్తించి విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఆఫీసర్లు రెండు రోజుల కింద తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో బ్యాంకుల్లో జమ చేయని డీడీలతో పాటు పన్నుల ద్వారా వచ్చిన నగదును గుర్తించారు. నిబంధనల ప్రకారం కార్యాలయానికి వచ్చిన డీడీలను, నగదును మరుసటి రోజు మధ్యాహ్నం లోపు బ్యాంకుల్లో జమ చేయాలి. కానీ అలా చేయకపోవడంతో అక్రమాలు జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. 

డీడీ రీసైక్లింగ్ ఇలా...

కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు షోరూమ్ యాజమాన్యాలు కొంతమేర డిస్కౌంట్లు ఇస్తాయి. డిస్కౌంట్ అమౌంట్ కు బదులు అసలు అమౌంట్​ బిల్లులను డీటీవోకు పంపితే వాహన రిజిస్ట్రేషన్ సమయంలో డిఫెరెన్షియల్ అమౌంట్ పేరిట ప్రత్యేకంగా డీడీ కట్టించుకుంటారు.  దీంతో వాహనదారుడు డీడీలను చెల్లించిన తరువాత వాటిని రికార్డుల్లో నమోదు చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సిద్దిపేటలో మాత్రమే ఇలా డీడీలను వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వచ్చిన డీడీలను కొందరు అధికారులు దారి మళ్లించి ప్రైవేటు వ్యక్తులకు అందజేసి అంతే మొత్తాన్ని నగదు రూపంలో పొందుతున్నారు. డీడీలు కొనుగోలు చేసిన వ్యక్తులు ఇతర సేవలకు సంబంధించి డీటీవోలో పన్నులు చెల్లించేందుకు వచ్చిన వారికి మాయమాటలు చెబుతూ ఎక్కువకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.  ఇలా డీడీలను రీసైక్లింగ్ చేస్తుండటంతో కార్యాలయంలో ప్రభుత్వానికి జమ చేయకుండా కొన్ని మిగిలిపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్టు తెలుస్తోంది.

సిబ్బందికి, బ్రోకర్లకు గొడవలు.. పోలీస్ కేసులు

సిద్దిపేట ఆర్టీవోలో కొంత కాలంగా సిబ్బందికి, బ్రోకర్లకు మధ్య గొడవలు జరిగి పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయి. సిద్దిపేట డీటీవోవద్ద దాదాపు వంద మంది బ్రోకర్లు ఉన్నారు. వారంతా అధికారులకు మామూళ్లు ఇచ్చి తమ ద్వారా వచ్చే దరఖాస్తులకు  ప్రత్యేక కోడ్ లు వేయించుకుని  పనులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి, బ్రోకర్లకు మధ్య రెండు నెలల్లో రెండు సార్లు గొడవలు జరిగాయి. మామూళ్ల రేట్లు పెంచడంతో ఓ బ్రోకర్ అధికారులతో గొడవ పడ్డాడు. విషయం చిలికి చిలికి గాలి వానలా మారడంతో సదరు బ్రోకర్ పై డీటీవో అధికారులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ గొడవతో కేవలం  నలుగురు బ్రోకర్ల ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తుండటంతో వారే అందరి పనులను చక్కదిద్ది అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వారం రోజుల కింద ఓ బ్రోకర్ ను హోంగార్డు కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం కూడా పోలీస్ 
స్టేషన్ వరకు వెళ్లింది.  

నగదు డిపాజిట్ చేయలేదు

సిద్దిపేట డీటీవోలో కొన్ని డీడీలు, నగదు డిపాజిట్ చేయని విషయాన్ని తనిఖీల్లో గుర్తించాం. ప్రస్తుతం అన్ని విషయాలపై విచారణ జరుపుతున్నందున పూర్తి వివరాలను వెల్లడించలేను. - రమేశ్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్

డీటీవో సేవలపై ఆరోపణల వెల్లువ

సిద్దిపేట డీటీవోలో మామూళ్లు ముట్టచెప్పందే పనులు కావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఏజెంట్లను నియమించుకుని ఒక్కో సేవకు ఒక్కో రేటు నిర్ణయించి దర్జాగా వసూలు చేస్తున్నారు.  ఇందుకోసం ఏకంగా ఒక జాబితాను తయారు చేసి బ్రోకర్లకు ఇవ్వడం గమనార్హం. డ్రైవింగ్  లైసెన్స్ కోసమో లేక రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర సేవల కోసం నేరుగా కార్యాలయం వెళ్లే వారికి నిరాశే ఎదురవుతోంది. బ్రోకర్ ను ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మామూళ్లు ముట్టచెబితేనే పనులు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక నేత అండదండలతో కొందరు అధికారులు ఇలా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.