
హైదరాబాద్: టీఆర్ఎస్ తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులతో ఈటలపై సీఎం కేసీఆర్ ఒత్తిడి పెంచుతున్నారని.. దాన్ని తప్పించుకోడానికే ఈటల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఆధిపత్యం కోసం ఈటలతోపాటు ఆయన భార్య జమున, కొడుకు, కోడలిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ‘టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు. అదో ఫక్తు ఫాల్తూ పార్టీగా మారింది. తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసినోళ్లే ఇప్పుడు మంత్రులయ్యారు. 7 సంవత్సరాల్లో ఏం సాధించామో అర్ధం కావడం లేదు. టీఆర్ఎస్ నుంచి తప్పించుకోడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఈటల చూస్తున్నారు’ అని శ్రవణ్ పేర్కొన్నారు.