రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ

రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ

హీరో అల్లరి నరేశ్ టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా కామెడీ మూవీస్ తో బిజిగా ఉండే నరేశ్.. ఈ మధ్య తన జోనర్ ని పూర్తిగా మార్చేశాడు. గతేడాది నాందితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లరి నరేశ్.. ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రోజు రిలీజై ఈ మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా చూద్దాం.

అల్లరి నరేశ్ గతకొంతకాలంగా వరుస ప్రయోగాలు చేస్తున్నాడు. గతంలో కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నరేశ్... గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాల్లో సెంటిమెంట్‌ పండించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. గతేడాది థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ నాంది లో నటించిన నరేశ్.. ఇప్పుడు ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాలో మరోసారి సీరియస్ రోల్‌ లో కనిపించాడు.

కథేమిటంటే.. 

గిరిజన ప్రజలు, వారి హక్కుల కోసం చేసే పోరాటాలు, ప్రభుత్వాధికారుల పనితీరు. ఇదే ఈ సినిమా స్టోరీ. ప్రజలకోసం ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈ మూవీలో క్లియర్ గా డైరెక్టర్ చూపించాడు. ఈ సినిమాలో గవర్నమెంట్ తెలుగు టీచర్ గా నరేశ్ యాక్ట్ చేశాడు. ఎలక్షన్ డ్యూటీలో భాగంగా.. గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లికి వెళ్తాడు. రోడ్డు, స్కూల్, హాస్పటల్ వంటి కనీస వసతి సౌకర్యాలు లేని ఆ ప్రాంతం ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారు. ఇక ఎలక్షన్ ఆఫీసర్ గా వెళ్లిన నరేశ్.. అక్కడ పోలింగ్ జరిపించాడా? అక్కడి ప్రజలు ఓటు వేశారా? వాళ్లకు కావాల్సిన కనీస సదూపాయాల కోసం ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించారన్నదే ఈ సినిమా.

ఎలా ఉందంటే..

దర్శకుడు ఏఆర్ మోహన్ తాను రాసుకున్న కథని చక్కగా తీశాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలని బాగా తెరపై చూపించడాడు. సీరియస్ స్టోరీలో కాస్త కామెడీ ఉన్నా.. రోటీన్ స్టోరీ కావడంతో మూవీలో ఏదో లోపించనట్లు అనిపిస్తుంటది. గిరిజన ప్రాంతాల సమస్యలని ప్రస్తావించినా.. ఇంకా ఏమైన ఉంటే బాగుండు అనే మూడ్ లో ప్రేక్షకులు ఉంటారు.

ఎవరెలా చేశారంటే..

ఇక అల్లరి నరేశ్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీతో పాటు సీరియస్ క్యారెక్టర్ లు చేయగలడని ఇదివరకే ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మూవీలో గవర్నమెంట్ తెలుగు టీచర్ గా తెరపై కనిపించేది కొంత సేపే అయినా.. ఎలక్షన్ అధికారిగా తన విధిని బాధ్యతగా నిర్వహించే పాత్రలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్‌ గా నటించిన ఆనంది తన పాత్రకు న్యాయం చేసింది. అయితే గిరిజన యువతిగా కాకుండా... మాములుగా కనిపించడం కాస్తంత మైనస్ అనే చెప్పాలి. ఇక వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇంగ్లీష్ టీచర్ పాత్రలో తన క్యారెక్టర్‌ కు వంద శాతం న్యాయం చేశాడు. గిరిజన యువ నాయకుడిగా నటించిన శ్రీతేజ్ నటన బాగుంది. మిగతా పాత్రల్లో నటించిన ప్రవీణ్, కలెక్టర్‌ గా సంపత్ రాజ్, ఊరి ప్రజల నుంచి తక్కువ రేటుకే సరుకులు కొనే వ్యాపారి పాత్రలో రఘుబాబు న్యాయం చేశారనే చెప్పొచ్చు. అయితే సినిమా మొత్తం సిరియస్ గా ఉండటం.. కొంచెం ఎడిటింగ్ లోపం కనిపించడంతో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తది. 

కొసమెరుపు:  సినిమా మొత్తం సీరియస్..కొంచెం ల్యాగ్

తారాగణం: అల్లరి నరేష్‌, ఆనంది, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్‌రాజ్‌ తదితరులు
కెమెరా: రాంరెడ్డి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సంభాషణలు: అబ్బూరి రవి
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌
నిర్మాత: రాజేష్‌ దండా
రచన–దర్శకత్వం: ఎ.ఆర్‌.మోహన్‌