ఏదైనా చేయాలని మనసులో గట్టిగా అనుకుంటే చాలు..

ఏదైనా చేయాలని మనసులో గట్టిగా అనుకుంటే చాలు..

ఏదైనా చేయాలని మనసులో గట్టిగా అనుకుని, పట్టుదలతో ప్రయత్నిస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. అందుకు వయసుతో సంబంధం లేదనడానికి ఈ పెద్దాయనే ఉదాహరణ. స్కాట్లాండ్​కు చెందిన ఇతని పేరు నిక్​ గార్డ్​నర్​. అల్జీమర్స్​, ఆస్టియోపోరోసిస్​తో బాధపడుతున్న భార్యని చూసి తట్టుకోలేకపోయాడు. అలా అనారోగ్యంతో ఆమెలాగ హెల్త్​కేర్ సెంటర్లలో ఉన్న వందల మందికి ట్రీట్మెంట్​కోసం ఫండ్స్​ సేకరించాలి అనుకున్నాడు.​ అందుకని తమ దేశంలోని ఎత్తైన 282 పర్వతాల్ని ఎక్కాలనే ఛాలెంజ్ తీసుకున్నాడు. అది  కూడా ఎనభై ఏండ్ల వయసులో. ఈమధ్యే (ఆగస్టు 13న) సక్సెస్​ఫుల్​గా అన్ని పర్వతాలు ఎక్కి ఆ ఛాలెంజ్​ పూర్తి చేశాడు. భార్య జానెట్​కు అల్జీమర్స్​, ఆస్టియోపొరోసిస్​ సమస్య ఉందని తెలియగానే ఒత్తిడికి లోనయ్యాడు నిక్​. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అల్జీమర్స్​, ఆస్టియోపోరోసిస్​ ఉన్నవాళ్లకు ట్రీట్మెంట్​ అందించే ‘అల్జీమర్స్ స్కాట్లండ్​, రాయల్​ ఆస్టియోపోరోసిస్​  సొసైటీ’లకు 50 వేల యూరోల ఫండ్స్ రైజ్​ చేయాలని... 2020 జులై నెలలో స్కాట్లండ్​లోని ఎత్తైన 282 కొండలు ఎక్కడానికి సిద్ధమయ్యాడు నిక్​. అప్పటికి మూడు నెలలు అయింది అతను 80వ పుట్టినరోజు చేసుకుని. ఫిట్​గా ఉన్నప్పటికీ ఆ వయసులో తండ్రిని  ఒంటరిగా ట్రెక్కింగ్​కు  పంపించేందుకు అతని ఇద్దరు కూతుళ్లూ ఇష్టపడలేదు. అందుకని సోషల్​మీడియాలో కొంతమంది ట్రెక్కర్స్​ని వెతికారు. వాళ్లతో కలిసి అడ్వెంచరస్​ ట్రిప్​ మొదలుపెట్టాడు నిక్​.  ఒక్కో పర్వతం ఎక్కిన తర్వాత భార్యకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నాక మరింత ఉత్సాహంతో మరో కొండవైపు నడిచేవాడు నిక్​.  

70 వేల యూరోలు...

ఈ మధ్యే  మూడు వేల అడుగుల ఎత్తైన ‘మున్రో’  పర్వతం ఎక్కి మొత్తం 282 మౌంటెయిన్​ ఛాలెంజ్​ని పూర్తి చేశాడు నిక్​.  మున్రో కొండ మీదికి చేరాక చిన్న పిల్లాడిలా సంబరాలు చేసుకున్నాడు. ఛాలెంజ్​లో ఇదే చివరి ట్రిప్​ కావడంతో నిక్​ వెంట అతని ఇద్దరు కూతుళ్లు, మనవలు, మనవరాండ్లతో పాటు అల్జీమర్స్​, రాయల్ ఆస్టియోపోరోసిస్​ సొసైటీ వలంటీర్స్ కూడా వచ్చారు. ఈ ఛాలెంజ్​ పూర్తి చేసి 70వేల యూరోలు కలెక్ట్ చేశాడు నిక్​. అనుకున్న దాని కంటే 20 వేల యూరోలు ఎక్కువ కలెక్ట్​ చేసినందుకు చాలా సంతోషించాడు. 

నా కాళ్లకు రెస్ట్ ఇస్తా

‘‘చివరి పర్వతం ఎక్కిన తర్వాత చాలా ఎగ్జైటింగ్​గా అనిపించింది. క్రిస్మస్ పండుగ రోజు గిఫ్ట్స్​ తెరిచి చూస్తున్న చిన్న పిల్లాడిలా సంతోషించా. ఈ ఛాలెంజ్​ కోసం కొండలు ఎక్కి, దిగడంతో నా కాళ్లు బాగా అలసిపోయాయి. వాటికి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నా”అని చెప్పాడు నిక్.