
- మా ఆడబిడ్డల జోలికొస్తే ఎట్లుంటదో పాక్‌కు చూపించినం: మోదీ
- 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టినం
- ఇంకా దాడి చేస్తే మేం కొట్టే దెబ్బ ఊహకు కూడా అందదు
- మనకు న్యాయంగా దక్కాల్సిన సింధూ జలాలు ఇచ్చేదే లేదు
- బికనీర్‌లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవంలో ప్రధాని
- బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభం
బికనీర్ (రాజస్థాన్): భారతీయ మహిళల సిందూరం భగ్గుమంటే.. దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచమంతా చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను ఎప్పుడూ కూల్‌గానే ఉంట. కానీ.. నా రక్తం మాత్రం మరుగుతూనే ఉంటది. ఇప్పుడు నా నరనరాల్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు.. మరుగుతున్న సిందూరం’’అని మోదీ అన్నారు. 22 నిమిషాల్లోనే పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు.
పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టామన్నారు. టెర్రరిస్టులను మట్టిలో కలిపేశామని చెప్పారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని గురువారం ప్రారంభించారు. అనంతరం పలానాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. టెర్రరిస్టుల అంతు చూసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ‘‘భారతీయ మహిళల సిందూరం జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటదో టెర్రరిస్టులకు తెలిసేలా చేశాం. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టినం.
ఇక నుంచి ఇండియాపై ఒక్క టెర్రరిస్ట్ అటాక్ జరిగినా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్తాం. మేము కొట్టే దెబ్బ పాకిస్తాన్ ఊహకు కూడా అందదు. టెర్రరిస్టులను అంతం చేయడానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారు. తన ఎయిర్‌బేస్‌లను చూసుకుని పాకిస్తాన్ విర్రవీగింది. మన త్రివిధ దళాలు ఆ ఎయిర్బేస్లన్నింటినీ నామరూపాల్లేకుండా చేశాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నది. అది ఎప్పుడు తెరుచుకుంటుందో కూడా తెలియనిపరిస్థితి’’అని మోదీ అన్నారు.
అడుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు..
ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ ఇక నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. దాడి చేసే సమయం, వ్యూహం, నిబంధనలను ఇండియన్ ఆర్మీనే స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే.. భవిష్యత్తులో ఒక్క రూపాయి కోసం ఆ దేశం అడుక్కునే పరిస్థితికి దిగజారుతదని తెలిపారు.
‘‘అణుబెదిరింపులకు ఇండియా ఇక ఏమాత్రం భయపడదు. పాకిస్తాన్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవు. చర్చల మాట అంటూ వస్తే.. అది పీవోకే గురించే. ఉగ్రదాడి జరిగితే.. పాకిస్తాన్ ఆర్మీ, ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తదని మనం స్పష్టం చేశాం. పాకిస్తాన్‌లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (టెర్రరిస్టులు) కలిసి ఆడే ఆటలు ఇక సాగవు. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీళ్లు.. ఇక పాకిస్తాన్‌కు ప్రవహించవు. ఇండియన్స్ జోలికివస్తే.. గట్టి గుణపాఠం తప్పదు’’అని మోదీ హెచ్చరించారు.
బికనీర్ ఎయిర్‌బేస్‌ను టచ్ కూడా చేయనియ్యలే
ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రతి భారతీయుడు ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. త్రివిధ దళాల ధైర్యం, ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పం నెరవేరిందని తెలిపారు. ‘‘ఢిల్లీ నుంచి బయల్దేరి బికనీర్‌లోని నాల్ ఎయిర్‌పోర్టులో దిగాను. బికనీర్ ఎయిర్‌బేస్‌ను కూడా పాకిస్తాన్ ధ్వంసం చేయాలని చూసింది. కానీ.. మన బలగాలు ఆ దేశం కుట్రలను తిప్పికొట్టాయి.
బికనీర్.. వీరుల భూమి. రాజస్థాన్ ప్రజల ఉత్సాహం.. దేశంపై ఉన్న ప్రేమ.. నాకు కొత్త శక్తిని ఇచ్చాయి. గతంలో నేను చెప్పిన దాన్ని మళ్లీ ఓసారి గుర్తు చేస్తున్నాను. ‘‘సౌగంధ్ ముఝే ఇస్ మిట్టీ కి, మై దేశ్ నహీ మిట్నే దూంగా, మై దేశ్ నహీ ఝుక్నే దూంగా’’ కొందరి అండదండలు చూసి రెచ్చిపోయిన పాకిస్తాన్.. ఇప్పుడు శిథిలాల కింద కూరుకుపోయింది’’అని మోదీ అన్నారు.
ఇక్కడున్నది.. భరతమాత ముద్దు బిడ్డ మోదీ
టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషిస్తున్నదని, వారితో అమాయక ప్రజలను చంపిస్తున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘ఇండియాను భయపెట్టేందుకు టెర్రరిస్టులను మనపై పాకిస్తాన్ ఉసిగొల్పుతున్నది. కానీ.. ఆ పాకిస్తాన్ ఒక్కటి మరిచిపోతున్నది. ఇక్కడ ఉన్నది భరతమాత ముద్దుబిడ్డ.. మోదీ ఉన్నడని. నా మైండ్ కూల్‌గా ఉన్నది.. ఎప్పుడూ కూల్‌గానే ఉంటది. కానీ.. నా రక్తం మాత్రం ఎప్పుడూ మరుగుతూనే ఉంటది.
ఇప్పుడు నా నరనరాల్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు.. వేడెక్కిన సిందూరం’’అని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదని.. న్యాయం కోసం ఇండియా చేసిన అఖండ ప్రతిజ్ఞ అని తెలిపారు. ఇది 140 కోట్ల మంది ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. పాకిస్తాన్ ఎప్పుడూ ఇండియాతో డైరెక్ట్‌గా తలపడి గెలిచిన సందర్భాల్లేవని, టెర్రరిస్టులను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా 103 అమృత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం
జార్ఖండ్‌లోని గోవింద్పూర్ రోడ్, రాజ్‌మహల్, శంకర్పూర్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.21 కోట్లతో ఈ మూడు రైల్వే స్టేషన్లను రెన్నోవేషన్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, అస్సాంలోని 138 ఏండ్ల పురాతన హైబర్గావ్ రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రారంభించారు. రూ.15.83 కోట్లతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు మోదీ వివరించారు. టూరిజం సెక్టార్ డెవలప్ కోసం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
సరికొత్త ప్రణాళికలతో ముందుకు..
ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు మోదీ తెలిపారు. ‘‘రైల్వేను మోడ్రనైజ్ చేస్తున్నాం. వేగం, పురోగతికి వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లే నిదర్శనం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బికనీర్‌లో పునర్నిర్మించిన దేశ్‌నోక్ స్టేషన్‌ను ప్రారంభించుకున్నాం. బికనీర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైలును తెచ్చాం. రాజస్థాన్‌లో రైల్వే అభివృద్ధికి ఈ ఏడాది రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టాం. 2014తో పోలిస్తే.. 15 రెట్లు ఎక్కువ’’అని మోదీ అన్నారు. స్టేషన్ ప్రారంభించిన తర్వాత స్టూడెంట్లతో కాసేపు మోదీ ముచ్చటించారు. అలాగే దేశ్‌నోక్‌లోని కర్ణిమాత ఆలయంలో పూజలు చేశారు.