గోల్డ్‌ కాదు.. అంతకుమించి..

గోల్డ్‌ కాదు.. అంతకుమించి..

బంగారమనుకొని ఏళ్లుగా రాయిని దగ్గరపెట్టుకున్న ఆస్ట్రేలియన్‌‌‌
‌అరుదైన ఉల్క ముక్కని తేల్చిన జియాలజిస్టులు

అది ఆస్ట్రేలియాలోని మేరీబోరోగ్‌‌‌‌ రీజినల్‌‌‌‌ పార్క్‌‌‌‌. 2015వ సంవత్సరం. డేవిడ్‌‌‌‌ హోల్‌‌‌‌ అనే వ్యక్తి మెటల్‌‌‌‌ డిటెక్టర్‌‌‌‌తో ఏదో వెతుకుతున్నాడు. ఇంతలో ఓ రాయి లాంటి వస్తువు దొరికింది. పసుపు కలర్‌‌‌‌లో ఉంది. రాయి దొరికిన ప్రాంతం 19వ శతాబ్దంలో గోల్డ్‌‌‌‌కు ఫేమస్‌‌‌‌. దీంతో అది బంగారమేమోనని ఇంటికి తీసుకెళ్లాడు. పగలగొట్టడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. కట్‌‌‌‌ చేయడానికి ట్రై చేశాడు. పనికాలేదు. రంపంతో కోశాడు. చెక్కుచెదర లేదు. దీంతో ఏళ్లుగా దాన్ని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈమధ్యనే మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లోని మ్యూజియంకు ఆ రాయిని తీసుకెళ్లాడు. అక్కడి జియాలజిస్టుకు చూపించాడు. అప్పుడు తెలిసింది. అది బంగారం కాదు. అంతకన్నా అరుదైనదని.

‘డైమండ్‌ సా’తో కోసి..
మ్యూజియంలోని జియాలజిస్టు డెర్మోట్‌‌‌‌ హెన్రీ ఆ రాయిని పరీక్షించాడు. డైమండ్‌‌‌‌ సాతో కాస్త కోసి పరిశీలించి అది ఉల్క ముక్క అని, అందులో ఎక్కువగా ఇనుముందని గుర్తించారు. ఇంకా పరిశీలిస్తే రకరకాల ఖనిజాలు ఉండొచ్చని అన్నారు. అంతరిక్షం నుంచి వస్తూ భూమి వాతావరణంలోకి ప్రవేశించాక మండిపోయి భూమిపై పడ్డాక రాయిలా మారిందని వివరించారు. ఇది మార్స్‌‌‌‌, జూపిటర్‌‌‌‌ మధ్యనున్న ఆస్టరాయిడ్‌‌‌‌ బెల్టు లోనిదై ఉంటుందని.. అక్కడి ఆస్టరాయిడ్‌‌‌‌లు ఒకదానికొకటి తగిలి కక్ష్య మారి వచ్చుంటుందని భావిస్తున్నారు. 460 కోట్ల ఏళ్ల నాటి ఈ ముక్కకు అది దొరికిన ప్రాంతం పేరుమీదుగా మేరీబోరోగ్‌‌‌‌ అని పేరు పెట్టారు. కార్బన్‌‌‌‌ డేటింగ్‌‌‌‌ ద్వారా 100 నుంచి వెయ్యి ఏళ్ల కిందట భూమిపైకి వచ్చుంటుందని తెలుసుకున్నారు.