ఇవాంకా ట్రంప్ అసిస్టెంట్​కు కరోనా

ఇవాంకా ట్రంప్ అసిస్టెంట్​కు కరోనా

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్​కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైట్​హౌస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. దీంతో వైట్​హౌస్​లో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. వైరస్ బారిన పడిన అసిస్టెంట్ కొద్దిరోజులుగా ఇవాంకాకు దూరంగా ఉన్నారని, కాబట్టి ఇవాంకాకు ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నాయి. రోజూవారీ పరీక్షల్లో భాగంగా ఇవాంకా.. ఆమె భర్త కుష్నర్ కు శుక్రవారం టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్ కు వైరస్ కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. ‘‘కరోనా సోకిన కేటీ మిల్లర్ వండర్ ఫుల్ యంగ్ లేడీ, ఆమె చాలాకాలం పాటు ఆరోగ్యంగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఈరోజు పాజిటివ్ వచ్చింది”అని వైట్ హౌస్ లో కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ అన్నారు. తాను మిల్లర్ ను ఈ మధ్య కాలంలో కలవలేదని, ఉద్యోగరీత్యా ఆమె పెన్స్ ను తరచూ సంప్రదిస్తుంటారని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ మైక్‌ పెన్స్‌కి కరోనా టెస్టులు చేయగా నెగెటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు.