
తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన రాఘవ లారెన్స్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీనివాసుడి ఆశీర్వాదం కోసం తిరుమలకు రావడం జరిగిందని లారెన్స్ తెలిపారు. దేవుడు అన్ని ఇచ్చాడని, ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. అదే విధంగా భక్తులు కోరిన కోర్కెలు అన్ని నేరవేర్చాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.
ఏప్రిల్ 14వ తారీఖున ‘రుద్రన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రాఘవ లారెన్స్ ప్రకటించారు. అంతకుముందు గురువు సూపర్ స్టార్ రజినికాంత్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తలైవా ఆశీర్వాదం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ లో వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవ చేయాలని నిర్ణయించుకుంటానన్నారు. ఆకలి విలువ తెలుసుకుని ఈ సంవత్సరం అన్నదానం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగతంగా స్థలాలను సందర్శించి.. వీలున్నప్పుడల్లా ఆహారం పంపిణీ చేస్తానని.. ఇందుకు ఆశీస్సులు కావాలన్నారు.