ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ.. ఏం జరగబోతుంది..?

ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ.. ఏం జరగబోతుంది..?

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం టెర్రర్‎ ఎటాక్‎తో  భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్‎కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశంతో దౌత్య, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. శనివారం (మే 3) ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసంలో ఇరువురు సమావేశమయ్యారు. 2025, ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రర్ ఎటాక్ జరిగిన తర్వాత ఒమర్ అబ్ధుల్లా, ప్రధాని మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి.

దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పహల్గాం ఉగ్రదాడి, టెర్రర్ ఎటాక్ అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  భవిష్యత్తులో దాడులను నివారించడానికి భద్రతా చర్యలను సమీక్షించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడటం, బాధితులకు న్యాయం జరిగేలా చూడటం వంటి అంశాలపైన డిస్కస్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

పహల్గాం ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్‎లో కొనసాగుతోన్న ఏరివేత ఆపరేషన్ కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.  భారత్, పాక్ యుద్ధానికి సిద్ధమవుతోన్న వేళ జమ్మూ సీఎం ప్రధాని మోడీని కలవడంతో ఈ భేటీకి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూలో తాజా పరిస్థితిని తెలుసుకున్న కేంద్రం.. ఇక పాక్ పై సమర శంఖం పూరిస్తోందని ఊహాగానాలు వినబడుతున్నాయి. 

కాగా, 2025, ఏప్రిల్ 22వ తేదీ భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేని చీకటి రోజు. మినీ స్విట్జర్లాండ్‎గా పిలువబడే జమ్మూ కశ్మీర్‎లోని పహల్గాం బెసరన్ మైదాన ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన టెర్రరిస్టులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. తీవ్రవాదుల ఊచకోతలో 26 మంది పర్యాటలకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనే అని గుర్తించిన భారత్.. దాయాది దేశంపై గుర్రుగా ఉంది.