
సూర్యాపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సిద్ధం కావాలని విద్యుత్ శాఖ -మంత్రి జగదీశ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట రూరల్ మండలంలోని గ్రామాల నేతలు, కార్యకర్తలతో బూత్‌ల వారిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఊహించని రీతిలో అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వెళ్లాయని చెప్పారు.
గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మోసపూరిత హామీల గురించి వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఎన్నో గోసలు పడ్డామని, సీఎం కేసీఆర్ కేవలంలో తొమ్మిదేళ్లలోనే ఆ గోసలు తీర్చారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షం, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్‌చార్జిలు లు పాల్గొన్నారు.