NDAకు 250 సీట్లు రావొద్దని కోరుకున్నా! హోదాపై జగన్ హాట్ కామెంట్

NDAకు 250 సీట్లు రావొద్దని కోరుకున్నా! హోదాపై జగన్ హాట్ కామెంట్

వైసీపీ వస్తేనే ఏపీ ఇబ్బందులు తొలగుతాయని బలంగా నమ్మానన్నారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్. ఏపీ ఇబ్బందులు తొలగిపోవాలంటే కేంద్రం సాయం అత్యవసరమని చెప్పారు. వైసీపీ సపోర్ట్ తో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యుంటే… ఏపీకి అవసరమైనవి.. డిమాండ్ చేసి తెచ్చే పరిస్థితి ఉండేదన్నారు.

ఎన్డీఏకు 250, 260 సీట్లు దాటొద్దని దేవున్ని కోరుకున్నానని.. కానీ అలా జరగలేదని అన్నారు జగన్. ఏం చేద్దాం.. మా కర్మ ఇలాగే ఉంది అని నవ్వుతూ చెప్పారు. వైసీపీ సహాయం అవసరం లేకుండానే కేంద్రంలో బలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. రాష్ట్రం తరఫున విజ్ఞప్తులే చేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్రాన్ని బాగా నడపాలంటే డబ్బులు కావాలని.. అందుకే.. సాయం కోసం అభ్యర్థించాల్సి వచ్చిందని అన్నారు.

ప్రత్యేక హోదా తప్ప మిగతా అన్ని అటుఇటుగా నెరవేరుతాయనిపిస్తోందని జగన్ అన్నారు. ఎన్డీఏకు 250 వచ్చి ఉంటే.. మేం మద్దతు ఇచ్చి.. తొలి సంతకం ప్రత్యేక హోదాపై పెట్టించేవాళ్లమన్నారు. దురదృష్టవశాత్తూ అలా జరగలేదన్నారు. “హోదాపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. సంతకం పెడతారా అని అడిగితే ఏం చెబుతాం… మా ప్రయత్నం మేం చేసుకుంటూ పోతాం. ఒకటి మాత్రం కచ్చితం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు. విభజన సమయంలో చట్టంలో ఇది చేస్తాం అని రాసిచ్చిన హామీ. హామీని ఇప్పుడు వదిలేస్తే.. ఎప్పుడూ కూడా ఇవ్వరు. ఎంతమేరకు డబ్బులు రాబట్టగలుగుతాయో.. ఒత్తిడి పెంచగలమో దానిని చేసుకుంటూ వెళ్తాం. మోడీని కలిసిన ప్రతిసారి హోదాను అడుగుతూనే ఉంటా. ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటా. దాన్ని వదిలేసే ప్రసక్తే లేదు”  అన్నారు జగన్.

ఏపీ ప్రత్యేక హోదాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మద్దతు ఇచ్చారని జగన్ అన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలు… టీఆర్ఎస్ కు 9 మంది  ఎంపీలు కలిసి 31 మంది ఏపీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఫైట్ చేస్తామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

దేశంలో రెండో పవర్ ఫుల్ మ్యాన్ అమిత్ షానే 

అమిత్ షా తో భేటీ గురించి స్పందించారు జగన్. దేశంలో ప్రధాని మోడీ తర్వాత రెండో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.. రెండో పవర్ ఫుల్ మ్యాన్ ఎవరంటే ఆయనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నసంగతి ఎవరైనా ఒప్పుకోవాల్సందే అన్నారు జగన్. ప్రధానితో పని కావాలంటే.. అధికార పార్టీకి కూడా విన్నపాలు చేసుకోవాల్సిందే అన్నారు.