ఏపీలో చిరు వ్యాపారులకు చేయూత.. 'జగనన్న తోడు' నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీలో చిరు వ్యాపారులకు చేయూత..   'జగనన్న తోడు' నిధులు విడుదల  చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి జగనన్న తోడు పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది తొలి విడత అమౌంట్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఈరోజు( జులై 18) వర్చువల్ గా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 10 వేల 412 మంది చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ లేని రుణాలు మరియు వడ్డీ రీయంబర్స్మెంట్ మొత్తం కలిపి 560.73 కోట్లను ఈరోజు ( జులై 18)  బటన్ నొక్కి ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఏడాది 549.70 కోట్లను వడ్డీలేని రుణాల కింద మరియు 11.03 కోట్ల ను వడ్డీరీయంబర్స్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి జమ  చేసింది

జగనన్న తోడు ప్రతి లబ్ధిదారునికి  10 వేల రూపాయిలు బ్యాంకు రుణం అందజేస్తారు. వారు సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారు రెండవసారి రుణంగా 10 వేల రూపాయిలతో పాటు వెయ్యి రూపాయిులు  పొందుతారు. మూడవసారి, రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వారికి 10 వేల రూపాయిలతో పాటు 2 వేల రూపాయిలు  అందుతాయి. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటివరకు, షెడ్యూల్ ప్రకారం రుణాలను తిరిగి చెల్లించిన 15.31 లక్షల మంది లబ్ధిదారులకు మంగళవారం (జులై 18)  రూ.11.03 కోట్లతో సహా ప్రభుత్వం రూ. 74.69 కోట్లను వడ్డీ రాయితీగా రీయింబర్స్ చేసింది.

 లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేసిన జగనన్న తోడు పథకంలో  ఇప్పటివరకు చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయబడ్డాయి. ఇందులో 13,29,011 మంది చిరువ్యాపారులు గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి పలుమార్లు రుణాలను అభ్యర్థించి అందుకున్నారు. చిరువ్యాపారులు, చేతి వృత్తుల కళాకారుల కష్టాలను నిశితంగా గమనించి, తక్కువ లాభాలతో సేవలందిస్తూ ప్రైవేట్‌గా రుణాలు ఇచ్చేవారికి వడ్డీలు చెల్లించలేక జగనన్న తోడు పథకాన్ని రూపొందించారు.

చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తోంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు అవుతారు. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి.