- రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కామెంట్
మెదక్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ స్వయంగా రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం ఆధారంగా ఆమె జీవితాన్ని తెలుగులో తెరకెక్కిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ చిత్రానికి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని కోరారు. బుధవారం సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణానికి రూ.2 కోట్లు ఇస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు ప్రకటించారు.
సినిమా నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు 50 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. ఈ కమిటీని గాంధీ భవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షిస్తారని తెలిపారు. నాయకులు నిధులు సిద్ధం చేసుకోవాలని కోరారు. ‘ఎన్నికలకు ఖర్చు పెడతారు కదా. దీన్నీ అలాంటి ఖర్చుగానే అనుకోండి. బడ్జెట్ సమీకరించి, మంచి దర్శకుడిని ఎంపిక చేద్దాం’ అని కార్యకర్తలతో అన్నారు.
ఏర్పాట్లు పూర్తయ్యాక సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్‌ను ఆహ్వానించి, వారి చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. సోనియాగాంధీ జీవితాన్ని కార్యకర్తలు దగ్గరగా తెలుసుకునేందుకు ఆమె పుస్తక ప్రతులను తెప్పించి పంపిణీ చేస్తామన్నారు. కుటుంబ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు సోనియాగాంధీ జీవితంలోని వివిధ దశలను సినిమాలో చూపిస్తామని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలతో కుటుంబం ఎదుర్కొన్న విషాదం, ఆ తర్వాత సోనియా ఎదుర్కొన్న కష్టాలు, రాహుల్, ప్రియాంకను పెంచిన తీరు, ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
ఎన్నో మతాలు, కులాలు, భాషలతో కూడిన భారతదేశంలో సోనియాగాంధీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పారు. ఆమెకు ప్రధాని పదవిపై వ్యామోహం లేదన్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం పీవీ ప్రధాని అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో సోనియా ఆ పదవిని ఆశించలేదన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక సోనియాగాంధీని ప్రధానిగా ఉండాలని పార్టీ నేతలు కోరినా, ఆమె ఆ పదవిని స్వీకరించకుండా మన్మోహన్‌సింగ్‌కు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం నుంచి మళ్లీ ప్రధాని రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాహుల్ పీఎం కావాలనేది సోనియాగాంధీ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.
