ఏటూరు నాగారం: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చిన భక్తులకు అమ్మవార్ల ప్రసాదం అందకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించిన బంగారం (బెల్లం) కాకుండా వేరే భక్తులు అమ్మవార్లకు సమర్పించిన బంగారాన్ని ప్రసాదంగా తీసుకోవడం జాతర ఆనవాయితీ. కానీ ఈ ప్రసాదం భక్తులకు అందడం లేదు. గద్దెలపై భక్తులు వేసిన బంగారాన్ని.. కాంట్రాక్టర్ వెంటవెంటనే ట్రాక్టర్లలో బయటకు తరలిస్తున్నారు. అమ్మవార్ల ప్రసాదాన్ని ఇవ్వాలని ఎంత అడిగినా వలంటీర్లు ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మక్క, సారలమ్మను ప్రతీ ఇంట్లో పసుపు, కుంకుమ రూపంలో కొలుస్తుంటారు. అడవి తల్లులకు ప్రీతికరమైన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఏ ఊరిలో చూసినా ఎత్తు బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇంటికి 10 కిలోలకు తగ్గకుండా బెల్లం కొంటున్నారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు ఎత్తు బెల్లాలతో మొక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో.. కిరాణా షాపులు బెల్లం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
మేడారం జాతరకు, బెల్లానికి విడదీయరాని సంబంధం ఉంది. తల్లులకు సమర్పించే బెల్లాన్ని బంగారమని పిలుస్తారు. ఈ బెల్లాన్నే నైవేద్యంగా సమర్పిస్తారు. కాకతీయుల కాలం నుంచి ఇది కొనసాగుతోంది. ఒకప్పుడు వాహనాలు అందుబాటులో లేని కాలంలో వన దేవతల దర్శనానికి ఎడ్లబండ్లపై వచ్చేవారు. మైళ్ల కొద్దీ ప్రయాణించి వచ్చి మేడారంలో దాదాపు వారం గడిపేవారు.
ఈ క్రమంలో ఆకలైనప్పుడు తొందరగా శక్తినిచ్చే బెల్లంతో తయారు చేసే ఆహార పదార్థాలను తినేవారు. బెల్లం పానకంలో పల్లీలు, పుట్నాలు వేసి ముద్దలుగా తయారు చేసి తినేందుకు ఇష్టపడేవారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తే తల్లులు సంతోషిస్తారని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
సమ్మక్క-సారలమ్మలకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులు.. గద్దెల నుంచి చిటికెడు బెల్లాన్నయినా ఇంటికి తీసుకెళ్లాలని పోటీ పడతారు. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందనే వారి విశ్వాసం.
