కామారెడ్డిలో బెల్లానికి మస్తు గిరాకీ

కామారెడ్డిలో బెల్లానికి మస్తు గిరాకీ
  • స్థానికంగా అమ్మేందుకు వండుతున్న రైతులు
  • ఆరోగ్యానికి మంచిదని కిలో రూ.వంద ఇచ్చి కొంటున్న జనం
  • ఇంట్లో అవసరాలకూ డిమాండ్

కామారెడ్డి, వెలుగు: ఆరేండ్ల తర్వాత కామారెడ్డి ఏరియాలో బెల్లం వాసన వస్తోంది. చెరకును సాగు చేసిన రైతులు మళ్లీ బెల్లం వండుతున్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఎలాంటి ప్రాసెసింగ్​ లేకుండా, కెమికల్స్​వినియోగించకుండా రైతులు తయారీ చేస్తారు. ఈ బెల్లాన్ని కొనేందుకు స్థానికులు ఆసక్తి చూపుతుండడంతో కొందరు రైతులు ఇటీవల బెల్లం తయారీ షురూ చేశారు. కిలోకు రూ.100కు అమ్ముతున్నా, ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు కూడా గిట్టుబాటు అవుతోంది. ఒకప్పుడు బెల్లం తయారీకి కామారెడ్డి ప్రసిద్ధి. 

ఇక్కడ ఉత్పత్తయ్యే బెల్లం వివిధ రాష్ట్రాలకు ఎగుమతయ్యేది. గతంలో మన ఏరియాలో దీపావళి నుంచి శివరాత్రి వరకు ఏ ఊరికి వెళ్లినా గిర్కల సప్పుడు, బెల్లం ఘమఘమలు వచ్చేవి. బెల్లం తయారీ చేసే రైతులకు అప్పు కూడా పుట్టేది. 2002 కు ముందు   జిల్లాలో 50 నుంచి 60 వేల ఎకరాల్లో చెరకును సాగు చేసిన రైతులు బెల్లాన్ని వండేవాళ్లు. అప్పట్లో క్వింటాలుకు  రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు ఉండేది. 

గుడుంబా తయరీకి వెళ్తుందని..

ఇక్కడి నేలల స్వభావం, ప్రాసెసింగ్​చేయకుండా పాత పద్ధతితో బెల్లం వండడంతో నల్లగా వచ్చేది. నల్ల బెల్లం గుడుంబా తయారీకి వెళ్తుందనే ఉద్దేశంతో 20 ఏండ్ల కింద రవాణాపై ఆంక్షలు విధించారు. రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు. అప్పట్లో రైతుల వద్ద నిల్వల్ని ప్రభుత్వం తక్కువ రేటుకు కొనుగోలు చేసింది. రవాణాకు ఆటంకాలు ఎదురవుతుండడంతో రైతులు తయారీని బంద్​పెట్టారు. ఉద్యమ సమయంలో  బెల్లం రవాణాపై ఆంక్షలు ఎత్తేస్తామని కేసీఆర్​  చెప్పారు. ఆయన సీఎం అయ్యాక చర్యలు తీసుకోలేదు. చెరకు పంటను సాగు చేసిన రైతులు ప్రైవేట్ షుగర్​ఫ్యాక్టరీలకు సప్లయ్​  చేస్తున్నారు. ప్రస్తుతం టన్ను చెరుకు రూ.3,400 ఇస్తున్నారు. చెరుకును ఫ్యాక్టరీలకు తరలించేందుకు రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. దీంతో రైతులు వరి వైపు మళ్లారు.  ప్రస్తుతం జిల్లాలో 28 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నారు.

స్థానికంగా అమ్మేందుకు..

భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు, రామేశ్వర్​పల్లికి చెందిన మరో రైతు ఇటీవల తయారీ షురూ చేశారు. వీరు కిలో, అర కిలో ముద్దలు చేసి అమ్ముతున్నారు. బెల్లం అవసరమైన వారు వీరి పొలాల వద్దకే వెళ్లి కొంటున్నారు. ఒక్కొక్కరు తమ ఇంటి అవసరాల కోసం 2 కిలోలు, 5 కిలోలు,10 కిలోల చొప్పున తీసుకెళ్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో గిరాకీ మరింత పెరిగింది.

 చిల్లర అమ్మకాలతో లాభంచిల్లర అమ్మకాలతో రైతులకు గిట్టుబాటు అవుతుంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా వీళ్లే అమ్ముతున్నారు. కిలోకు రూ.100 పలుకుతోంది. చెరుకు బాగా పండితే ఎకరాకు 25 నుంచి 35 క్వింటాళ్ల బెల్లం దిగుబడి వస్తుంది. అన్నీ పోను 40 శాతం వరకు లాభం ఉంటుందని రైతులు చెబుతున్నారు. బెల్లం తయారీ చేస్తున్న విషయం తెలిసి రైతుల వద్దకు ఎక్సైజ్​ఆఫీసర్లు వెళ్లారు. గుడుంబా తయారీ చేసే వారికి, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి అమ్మొద్దని ఎక్సైజ్​ఆఫీసర్లు రైతులకు సూచించారు.

చాలా మంది వచ్చి కొంటుర్రు

నాకు 3 ఎకరాల భూమి ఉంది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. 7 ఎకరాల్లో చెరకు పంట పెట్టినా. ఫ్యాక్టరీకి చెరకుకు పంపేందుకు చాలా రోజులు ఆగాల్సి వస్తోంది. మా తాతల కాలం నుంచి బెల్లం వండేవాళ్లం. ఏడేండ్ల కింద ఆపేశాం. బెల్లం వండితే కష్టమైనప్పటికీ అన్నీపోను గిట్టుబాటు అవుతుంది. ఆలోచించి మళ్లీ బెల్లం వండడం షురూ చేసినా. ఇంట్లో వాడుకోడానికి నా పొలం దగ్గరకే వచ్చే కొనుక్కుపోతుండ్రు. ఆంక్షలు ఎత్తేస్తే మేలు. 

జేపీ రామాగౌడ్, భిక్కనూరు

బెల్లం వండితేనే మిగులుతుంది

నాలుగెకరాల్లో చెరుకు పంట చేశా. గతంలో మా ఊరిలోని రైతులందరూ బెల్లం వండేవాళ్లం. సర్కారు వద్దనడంతో కొన్నాళ్లు ఆపేశాం. మన బెల్లం బాగుంటుందనే ఉద్ధేశంతో ఇక్కడి వాళ్లకే అమ్ముదామని మొదలు పెట్టా. క్రషర్ వద్దకే వచ్చి కొనుక్కొని వెళ్తున్రు.  బెల్లం వండితేనే మాకు మిగులుబాటు ఉంటుంది.  ఎక్సైజ్​శాఖ వాళ్లు వచ్చి తీసుకెళ్లే వారి పేర్లు రాసి పెట్టమని చెప్పిన్రు.

 కేతి రాములు, రామేశ్వర్​పల్లి