రెండేళ్లయినా ప్రారంభం కాని జగిత్యాల కలెక్టరేట్​

రెండేళ్లయినా ప్రారంభం కాని జగిత్యాల కలెక్టరేట్​
  • మూడుసార్లు రద్దయిన సీఎం టూర్
  • డ్యామేజ్​అవుతున్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు 

జగిత్యాల, వెలుగు: ప్రజల సమస్యల పరిష్కారం, పాలన సౌలభ్యం కోసం నిర్మించిన జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌‌ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పక్కజిల్లా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లలో ప్రారంభోత్సవాలు జరిగినా జగిత్యాలలో మాత్రం కొత్త  కలెక్టరేట్‌‌ భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు.

2017లో భూమి పూజ..

జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ ల్యాండ్ లో కలెక్టరేట్ కోసం 25 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందులో 33 ప్రభుత్వ శాఖల ఆఫీసులు, ప్రతి అంతస్తులో సెమినార్‌‌ హాల్స్‌‌, ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్‌‌ హాళ్లు తదితర అన్ని వసతులు ఉండేలా 2017 అక్టోబర్ 11న అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలెక్టరేట్‌‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.62 కోట్లతో పనులు ఆర్‌‌అండ్‌‌బీ శాఖ ద్వారా చేపట్టగా 2021 ప్రారంభంలో భవన నిర్మాణం పూర్తయ్యింది. అప్పటి నుంచి ప్రారంభానికి నోచుకోవడంలేదు. ప్రస్తుతం  జిల్లాలో ఒక్కో ప్రభుత్వ ఆఫీస్​ఒక్కో దగ్గర ఉండటంతో జిల్లాకు వచ్చే ప్రజలు ఏ కార్యాలయం ఎక్కడుందో అర్థం కాక నానా ఇబ్బందులు 
పడుతున్నారు.

సీఎం టూర్ మూడు సార్లు రద్దు..

సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్ రెండేళ్ల లో మూడు సార్లు రద్దు కావడం తో కలెక్టరేట్ ప్రారంభానికి నోచుకోలేదు. 2020 మార్చి లోనే సీఎం టూర్ రద్దు కాగా, మరో సారి 2021 ఏప్రిలో లో రద్దయ్యింది. మూడో సారి 2022, అగస్ట్, సెప్టెంబర్ సీఎం టూర్ ఖరారైంది. అగస్టు 25న రంగారెడ్డి కలెక్టరేట్, 29న పెద్దపెల్లి కలెక్టరేట్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ కలెక్టరేట్ ఓపెన్ చేశారు. సెప్టెంబర్ 10న జగిత్యాల కలెక్టరేట్ ఓపెన్ చేయాల్సి ఉండగా అనివార్యకారణాలతో మళ్లీ రద్దయ్యింది. మునుగోడు ఎన్నికల్లు ముగిశాక సీఎం అపాయింట్ మెంట్ దొరికితే కలెక్టరేట్ ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రెండేళ్లుగా నిరుపయోగంగానే..

2017లో నిర్మాణం ప్రారంభమైన కలెక్టరేట్ 2021 ప్రారంభంలో ఓపెనింగ్ కు సిద్ధమైంది. పనులు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో భవనం పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీంతో కలెక్టరేట్​పూర్తిగా పాత భవనంలా మారిపోతోంది. భవనంలో ఫర్నిచర్‌‌, విద్యుత్‌‌ పరికరాలు, ఇతరత్ర విలువైన వస్తువులు దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఇలానే కొనసాగితే లక్షలు విలువ చేసే ఫర్నిచర్ మూలకు పడే ఆవకాశం ఉందని ఆఫీసర్లు వాపోతున్నారు. ఆఫీస్ శుభ్రపరిచేందుకు ప్రతీ నెల రెండు లక్షల వరకు ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని ప్రతి పక్ష నేతలు విమర్శిస్తున్నారు.

సేవలందించడంలో విఫలం

కలెక్టరేట్ పూర్తయి రెండేళ్లయినా ఓపెనింగ్ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థ పనితీరుకు నిదర్శనం. జిల్లా ఏర్పాటు చేశామని చెపుతున్న సర్కార్ ప్రజలకు సేవలందించడంలో పూర్తిగా విఫలమైంది.

- బీరం రాజేశ్, 
కాంగ్రెస్ లీడర్, జగిత్యాల