
జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల చల్‌గల్ మామిడి మార్కెట్‌లో బుధవారం అర్ధరాత్రి రైతులు ఆందోళనకు దిగారు. కమీషన్ ఏజెంట్లు ఓపెన్ యాక్షన్‌లో నిర్ణయించిన రేటును కట్టివ్వకుండా మోసం చేస్తున్నారని, కమీషన్ ఎక్కువగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ మామిడి మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు ఓపెన్ యాక్షన్ నిర్వహించారు. ఇందులో క్వింటాల్‌కు రూ. 38 వేల ధరను నిర్ణయించారు. తర్వాత రూ. 38 వేలకు బదులు రూ. 30 వేలు మాత్రమే ఇస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన మామిడి రైతులు ఆందోళనకు దిగారు. కమీషన్ ఏజెంట్లు సిండికేట్‌గా మారి క్వాలిటీ, గ్రేడ్లు అంటూ ధర తగ్గిస్తున్నారని మండిపడ్డారు.
పైగా రూల్స్ ప్రకారం 4 శాతం కమీషన్ తీసుకోవాల్సి ఉండగా.. 10 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. మామిడి కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. వారం వరకు తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మామిడి రైతులు, కమీషన్ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న మార్కెట్ సెక్రటరీ రాజశేఖర్ రైతులతో మాట్లాడి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.