
- అభివృద్ధి చేసినందుకే రెండుసార్లు గెలిపించిన ప్రజలు
జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. ఆయన గాంధీభవన్ లో కూర్చుని తనను ఇండిపెండెంట్ అనడం సరికాదని, కాంగ్రెస్ లో అత్యధిక సార్లు ఓడిన నాయకుడు ఆయనేనని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తనతో సన్నిహితంగా ఉండడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.
జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అని చెప్పుకుంటూ.. గతంలో మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. యావర్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో ఉండి బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని గతంలో మీడియా ముఖంగా చెప్పింది వాస్తవం కాదా..? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను అభివృద్ధి చేసినందునే రెండోసారి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని చెప్పారు. ఇకనైనా జీవన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని, హుందాతనం కోల్పోవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట నేతలు దామోదర్ రావు, గిరి నాగభూషణం, జ్యోతి, శ్రీనివాస్ నారాయణ రెడ్డి, ప్రవీణ్, భిక్షపతి తదితరులు ఉన్నారు.