
కోరుట్ల, వెలుగు: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఇల్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణాలు పనులను ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు.
ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు నిర్దేశిత గడువులోపు, రూల్స్‌కు అనుగుణంగా నాణ్యతతో పనులను పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇళ్లు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులను పలకరించి, ఇంటి నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న మెట్‌పల్లిలో హైస్కూల్ కూల్చివేత పనులను పరిశీలించారు.
తర్వాత కోరుట్ల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న నవోదయ విద్యాలయ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవోలు జివాకర్ రెడ్డి , శ్రీనివాస్, తహసీల్దార్లు కృష్ణ చైతన్య, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్ ఉన్నారు.