జగిత్యాల జిల్లాలో ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

 జగిత్యాల జిల్లాలో ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  జగిత్యాల సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ గురువారం మీడియాకు వివరాలు తెలిపారు. బిజినెస్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ట్రేడింగ్ పేరుతో ఇటీవల కోరుట్ల, జగిత్యాలకు చెందిన ఇద్దరి నుంచి రూ.53 లక్షలు,  రూ.21 లక్షలు సైబర్​నేరగాళ్లు కొట్టేశారు. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సైబర్ నేరగాళ్ల బ్యాంకు అకౌంట్లను గుర్తించి నిందితులు నాగేంద్రప్రసాద్, యోగేశ్​కదం, సునీల్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకుని విచారించారు. నాగేంద్రప్రసాద్.. అన్వర్ అనే వ్యక్తి సూచనలతో కలకత్తాలో కొంతమందితో కలిసి ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ట్రేడింగ్ పేరుతో డబ్బులు కొట్టేసి, ఇతర అకౌంట్లకు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. ఇతనిపై దేశవ్యాప్తంగా 71 కేసులు, మరో ఇద్దరు నిందితులు యోగేశ్ కదం, సునీల్​పై 22 కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుల నుంచి ఫోన్, బ్యాంక్ అకౌంట్ బుక్స్, చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.