
కోరుట్ల, వెలుగు: నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సోమవారం మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వీధి, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు.
ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల గుర్తింపు, కేసుల ఛేదన, నిందితుల అరెస్టు, ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీస్ శాఖకు సహకరిస్తున్న మెట్‌పల్లి వాసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాములు, సీఐలు అనిల్, సురేశ్‌బాబు, ఎస్ఐలు కిరణ్ కుమార్, అనిల్,రాజు పాల్గొన్నారు.
మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం
కరీంనగర్ క్రైం, వెలుగు: మహిళలు, యువతులు, బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ అలం తెలిపారు. వినాయక ఉత్సవాల సందర్భంగా కోలాటం, ఊరేగింపుల వద్ద షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అభ్యంతరకర ఫొటోలు, వీడియాలో తీసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మహిళల రక్షణకు షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయనన్నారు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు 8712670759 లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.