విశ్వాసం: రామావతరణం

విశ్వాసం:  రామావతరణం

రాముడు, రాఘవుడు, రవికులుడు, ఇక్ష్వాకుల తిలకుడు, కౌసల్యానందనుడు, దాశరథి, సీతాపతి, రఘు కులాన్వయుడు, ఆజానుబాహుడు... 

ఇన్ని పేర్లు...  కాదు కాదు...  ఇవి కొన్ని పేర్లు మాత్రమే...

ఇన్ని పేర్లున్న రాముడిని మనకు ప్రాచేతసుడైన వాల్మీకి మహర్షి మానవులకు పరిచయం చేశాడు. మన వాడిని చేశాడు. తారక మంత్రం చేశాడు. ఇంటింటా పూజించేంత పవిత్రంగా రాముని వ్యక్తిత్వాన్ని అక్షరీకరించాడు.

సూర్యవంశంలో పుట్టిన రాముడు చంద్రుని పేరును తన పేరుగా మలచుకుని శ్రీరామచంద్రుడయ్యాడు. 

బాల్యంలో రాముడు దశరథుడి ఒడిలో ఆడుకుంటూ, ఆకాశంలో ఉన్న చందమామను చూసి, ‘నాన్నా! నాకు చంద్రుడు కావాలి’ అని మారాం చేశాడు. పుత్రవాత్సల్యం మెండుగా ఉన్న దశరథుడు కొద్దిసేపు ఆలోచించి.. ఒక అద్దం తీసుకువచ్చి, ఆ అద్దంలో రాముని ప్రతిబింబం పడేలా ఏర్పాటు చేసి, ‘నాయనా రామా! ఇదిగో చంద్రుడు’ అంటూ చూపాడు. చంద్రుడు తన దగ్గరకే వచ్చాడని ఆ బాల రాముడు సంతోషంతో కేరింతలు కొట్టాడు. అందుకేనేమో శ్రీరాముడు శ్రీరామచంద్రుడయ్యాడు. ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా రాముడికి మాత్రం ‘దాశరథి’ అనే నామమే రుచికరంగా అనిపిస్తుంది. దశరథుని కుమారునిగా పిలిపించుకోవటమే రామునికి ప్రీతి. 

శ్రీమదాంధ్ర మహాభాగవతం రచించిన సహజ కవి పోతన...
‘పలికించు విభుండు రామభద్రుండట’ అన్నాడు.
సంగీత స్వరాలతో కేళీవిలాసం నడిపిన త్యాగయ్యకు రాముడంటే అపరిమితమైన భక్తి.

వేల సంవత్సరాల క్రితం వచ్చిన రామాయణం ఆ తరువాత కాలంలో బహురూపాలు సంతరించుకుంది. బహువిధాలుగా కథ మలుపులు తిరిగింది. అక్షరజ్ఞానులంతా రాముడిని యథోచితంగా తమవాడిని చేసుకున్నారు. మూల కథకు కల్పనలు జోడించారు. వాటినీ జనబాహుళ్యం చేశారు.

మురారి – అనర్ఘరాఘవం; భవభూతి – ఉత్తర రామచరితం; కాళిదాసు – రఘువంశ మహాకావ్యం; గోన బుద్ధారెడ్డి – రంగనాధరామాయణం; భాస్కరుడు – భాస్కర రామాయణం; మొల్ల – మొల్ల రామాయణం; కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ – శ్రీమద్రామాయణ కల్పవృక్షం; శ్రీపాదవారి రామాయణం; పుల్లెల శ్రీరామచంద్రుడి వాల్మీకి రామాయణం; ఉషశ్రీ రామాయణం.. 
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే.

అలంకార శాస్త్రంలో కూడా...

గగనం గగనాకారం, సాగరః సాగరోపమః, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ... అని రాముడిని స్మరించుకున్నారు. 
‘రామ’ అనే నామాన్ని స్మరించినంత మాత్రానే సకల పాపాలు నశించిపోతాయని రామభక్తులు విశ్వసిస్తారు.

అయితే –

రాముని ప్రశంసించినవారికే కాదు...
దూషించిన వారిని కూడా రాముడు అనుగ్రహించాడు. 
వారికీ యశస్సు, కీర్తి ప్రసాదించాడు.
రాముని ప్రభవించి – దశరథుడు, కౌసల్య..
రాముని అడవులపాలు చేసి – కైకేయి,
రాముని వెంట అరణ్యవాసం చేసి –సీతమ్మ, లక్ష్మణుడు,
రామునితో మిత్రత్వం కొనసాగించి – గుహుడు,
రామునికి మంచి మంచి పండ్లు ఇచ్చి – శబరి,
రాముని చేతిలో హతమై – మారీచుడు,
రామునితో స్నేహం చేసి – సుగ్రీవుడు,
రాముని బంటు అయి – హనుమంతుడు,
రాముని శరణు కోరి – విభీషణుడు, 
రామునితో యుద్ధం చేసి – రావణుడు...

ఇంతమందీ రాముని కారణంగా కీర్తి, యశస్సుని సంపాదించుకున్నారు.

ఇంకా...

శ్రీరామునికి భద్రాచలంలో రామాలయం నిర్మించి, చెరసాల శిక్ష అనుభవించాడు కంచర్ల గోపన్న. అక్కడే శ్రీరాముని మీద కీర్తనలు రచించాడు. ‘గోపన్న’ అనే పేరు రామదాసుగా రూపాంతరం చెందింది. ఆయన రాసిన కీర్తనలు రామదాసు కీర్తనలుగా తెలుగు ప్రజల నాలుకలపై నిత్యం కదలాడుతుంటాయి. 

అక్కడితో ఆగలేదు గోపన్న. ఏకంగా ‘దాశరథీ కరుణాపయోనిధీ!’ అంటూ దాశరథీ శతకం రచించాడు.

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్‌
రెండవ సాటి దైవమిక లేడనుచున్‌ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!

రామునికి సాటి దైవము లేదు అని ఘంటాపథంగా చెప్పాడు. ‘రెండవ సాటి దైవమిక లేడనుచున్‌’ అనటంలోనే రాముని పట్ల గల ఆరాధన స్పష్టం అవుతుంది.రాముని ముఖం పున్నమి చంద్రుడిని పోలి ఉంటుంది. అమావాస్య నాడు కూడా పున్నమి చంద్రునిలాగే ఉంటాడు. మానవ శరీరంలో సూర్యుని అంశాలను సూచించేది ఆత్మ మాత్రమే. ప్రాణులన్నీ వివిధ గ్రహాల అంశాలతో ప్రభవిస్తాయి. బృహస్పతి నుండి జ్ఞానం, శని నుండి సూక్ష్మమైన విషయాలు, చంద్రుని నుండి సున్నితత్వం వస్తాయి. చంద్రుని లక్షణాలు రామునిలో అంతర్లీనంగా ఉన్నాయి. ‘రామ’ అనే పేరులోనే రాముని శారీరక అభివ్యక్తి, చాలా సున్నితంగా, అందంగా, మృదువుగా క్షమించే గుణం కలిగినవాడు, అందరికీ ప్రియమైనవాడు కాబట్టి రాముడిని ప్రేమతో ‘రామచంద్రా’ అని పిలుస్తారని కొందరు చెప్తారు. 

- వైజయంతి పురాణపండ, ఫోన్ : 80085 51232