ఆఖరుదాకా సోషలిస్టుగానే…

ఆఖరుదాకా సోషలిస్టుగానే…

మారుమూల పల్లె నుంచి ఢిల్లీ రాజకీయాలకు ఎదిగిన అతికొద్దిమంది తెలుగు నేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌‌ రెడ్డి జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేశారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌‌ పార్టీ నేతగా హై కమాండ్  ఆదేశాలను పాటించిన ఆయన.. ఎమర్జెన్సీ పేరిట ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు అధిష్టానంపైనే తిరగబడ్డారు. సబ్జెక్ట్‌‌ ఏదైనా.. చర్చ ఎక్కడైనా.. విషయం లోతుల్లోకి వెళ్లి అనర్గళంగా, విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగిన మేధస్సు ఆయనది. అరిస్టాటిల్‌‌ నుంచి మార్క్స్‌‌ వరకు అన్ని రాజకీయ తత్వశాస్త్రాల గురించి చెప్పేవారు. దక్షిణాది నేతయినప్పటికీ హిందీలో,  ఇంగ్లీష్‌‌లో ఎంతో ప్రావీణ్యంతో మాట్లాడి ఉత్తరాది నేతలను కూడా మెప్పించిన వాగ్ధాటి ఆయనకుంది.

జైపాల్‌‌రెడ్డితో నా పరిచయం నేను ఓయూలో పీజీ చదివే రోజుల్లో జరిగింది. ఆ రోజుల్లో ఆయన ఆలోచనలు, భావాలు, వేదికలపై ఆయన చేసిన ప్రసంగాలు విని నాతోపాటు నాలాంటి స్టూడెంట్లు, యువకులు చాలామందిమి ఆయనకు ఫాలోవర్స్‌‌గా మారిపోయినం. 70, 80వ దశకాల్లో ఆయన మాకు ఒక  ఐడియాజికల్‌‌ ఇనిస్టిట్యూషన్‌‌లా అనిపించేవారు. ఆయన సోషలిజం, ప్రజస్వామ్యం గురించి చేసిన ప్రసంగాలు మా ఆలోచనల్లో చాలా మార్పు తీసుకొచ్చాయి. వాస్తవానికి జైపాల్‌‌రెడ్డి స్టూడెంట్‌‌గా ఉన్నప్పుడు ఆయనపై రాజాజీ ప్రభావం ఎక్కువగా ఉండేది. రాజాజీ రాసిన లేఖలు, చేసిన ప్రసంగాలకు తాను ఆకర్షితులైనట్లు  చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. అయితే ఓయూలో ఆయన ఎంఏ ఇంగ్లిష్‌‌  చదివే రోజుల్లో మాత్రం  ప్రముఖ సోషలిస్ట్‌‌ నేత రాంమనోహర్‌‌ లోహియా సోషలిస్టు  భావాలు ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌ యూనియన్‌‌ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు లోహియాను ఉస్మానియా యూనివర్సిటీకి ఆహ్వానించి   ‘ప్రస్తుత రాజకీయాలు – విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై మాట్లాడించారు. చివరి వరకు జైపాల్ రెడ్డి సోషలిస్ట్‌‌గానే బతికారు. ఏడాది క్రితం ఆయన రాసి, విడుదల చేసిన ‘టెన్‌‌ ఐడియాలజీస్‌‌’  పుస్తకంలోనూ వ్యవసాయీకరణకూ, పారిశ్రామికీకరణకూ మధ్య ఉన్న తేడాలను తొలగించి సమాజానికి ఉన్న ముప్పును నివారించాలని చెప్పడం చూస్తే సోషలిజంపై  ఆయనకు ఎంత నమ్మకముందో అర్థమవుతుంది.

జైపాల్ రెడ్డి ఎప్పుడూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌ యూనియన్‌‌ మొదటి ప్రెసిడెంట్‌‌గా మొదలైన ఆయన రాజకీయ జీవితాన్ని గుంటూరులో జరిగిన యూత్‌‌ కాంగ్రెస్‌‌ సభ మలుపుతిప్పింది. యూత్‌‌ కాంగ్రెస్‌‌ రాష్ట్ర చీఫ్ గా  జైపాల్‌‌ రెడ్డి చేసిన ప్రసంగం అదే వేదికపైన ఉన్న అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీని విశేషంగా ఆకట్టుకుంది. ఇంత వాగ్ధాటిని  కలిగిన వక్త కాంగ్రెస్‌‌ రాజకీయాలకు అవసరమని భావించి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. అదే జైపాల్ రెడ్డి ఆ తర్వాతికాలంలో అంటే 1975లో అప్పటి  ప్రధాని  ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌‌ పార్టీకి రాజీనామా చేసి బయటికొచ్చి జనతాపార్టీలో చేరారు. విషయం తెలిసిన ఇందిరాగాంధీ వెంటనే జైపాల్‌‌ రెడ్డిని  ఢిల్లీకి పిలిపించి  ప్రత్యేకంగా అరగంటపాటు మాట్లాడారు. అప్పట్లో ఆయనకున్న ప్రయారిటీ అలాంటిది.  ఆ తర్వాత 1980లో ఏకంగా మెదక్‌‌ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఇందిరా గాంధీపైనే ఆయన పోటీకి నిల్చున్నారు. అప్పుడు ఓడిపోయినప్పటికీ 1984లో మహబూబ్‌‌నగర్‌‌ లోక్‌‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఐకే గుజ్రాల్ నాయకత్వంలో  ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా, యూపీఏ–2 ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి ఆ పదవులకు వన్నె తెచ్చారు. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌‌ను తగ్గించేందుకు, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు శాటిలైట్‌‌ టౌన్‌‌షిప్‌‌లను నెలకొల్పాలనే ప్రతిపాదనను కేంద్ర మంత్రిగా ఉండగానే చేశారు. ఆయన సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పడే ప్రసార భారతి బిల్లును చట్టంగా తీసుకొచ్చారు.

మొదటి నుంచి ఆయన పుస్తకాలను అమూలాగ్రం చదవడంతోపాటు అమెరికా, బ్రిటిష్‌‌ తదితర దేశాల పార్లమెంట్‌‌లో చేస్తున్న చట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ గారిని ఒప్పించడంలో ఆయన పాత్ర మరువలేనిది. సమావేశమైన ప్రతి సందర్భంలోనూ ఆమెతో తెలంగాణ ఆవశ్యకతను గురించి చెప్పి అనుకూలంగా మార్చడంలో సక్సెస్‌‌ అయ్యారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టినప్పడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్‌‌ను ఒప్పించడంలోనూ ఆయనదే కీలకపాత్ర. జైపాల్‌‌ రెడ్డి  రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా సోషలిస్టుగానే ఆలోచించారు. ఆయన తరం సోషలిస్టు నేతలు ఒక్కొక్కరుగా కనుమరుగవుతున్న ఈ కాలంలో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యం.

-కె.యాదవరెడ్డి, సీనియర్‌ రాజకీయ నేత