హిమాచల్ ట్రాజెడీ: చనిపోయే ముందు డాక్టర్ చేసిన ట్వీట్

హిమాచల్ ట్రాజెడీ: చనిపోయే ముందు డాక్టర్ చేసిన ట్వీట్

సిమ్లా: ప్రకృతి అందాలను చూసేందుకు హిమాలయాల్లో విహరిస్తున్న టూరిస్టులను ఆ కొండలే కబళించాయి. హిమాలయ పర్వతాల్లోని కొండ రాళ్లు జారిపడి ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది మంది మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌‌లో జరిగిన ప్రమాదంలో మరణించి టూరిస్టుల్లో ఒకరైన డాక్టర్ దీపా శర్మ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఒక ఫొటోను ట్వీట్‌ చేసింది. ఇండియా టిబెట్ బోర్డర్ ప్రాంతంలో ఉండి ఆ ఫొటో తీసుకున్న దీపా శర్మ  చైనా ఆక్రమణను నిందిస్తూ ఫొటో క్యాప్షన్‌ పెట్టి పోస్ట్ చేసింది. ‘‘సరిహద్దులో మన భారత ప్రజలను అనుమతించే చివరి పాయింట్‌లో నేను నిల్చుని ఉన్నాను. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో టిబెట్‌తో మనకు బోర్డర్ ఉంది. ఆ దేశాన్ని చైనా ఆక్రమించి తిష్ట వేసింది” అంటూ నగస్తి వద్ద ఉన్న ఐటీబీపీ చెక్‌ పోస్ట్‌ వద్ద తీసుకున్న ఫొటోను ఆమె ఆదివారం మధ్యాహ్నం 12.59కి పోస్ట్ చేసింది. ఆ తర్వాత అర గంటకే హిమాచల్‌ ప్రదేశ్‌లోని సాంగ్లా చిట్కుల్ రోడ్‌ వద్ద దీపా శర్మతో పాటు మరికొందరు టూరిస్టులు హిమాలయాల అందాలను చూస్తూ నిల్చుని ఉండగా కొండ రాళ్లు విరిగిపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీపా శర్మ చేసిన చివరి ట్వీట్‌తో పాటు ముందు రోజు ‘ప్రకృతి లేని జీవితం శూన్యం (లైఫ్ ఈజ్ నథింగ్ వితౌట్ మదర్ నేచర్)’ అంటూ పోస్ట్ చేసిన ట్వీట్‌ కూడా వైరల్ అవుతున్నాయి. మిగతా ట్వీట్లకు లైక్‌లు, షేర్లు వందల్లోనే ఉంటే.. ఈ రెండు ట్వీట్లకు లైక్‌లు 20 వేలు దాటిపోయాయి. దాదాపు 3 వేల మంది రీ ట్వీట్లు చేశారు.

మరోవైపు మొదట నేచర్, ఆ ప్రాంతం, ఆమె ఫొటోగ్రఫీపై చాలా మంది కామెంట్లు చేయగా.. ఆ తర్వాత ఆమె మరణం గురించి తెలిసి దీపా శర్మ ఆత్మకు శాంతి కలగాలంటూ పోస్ట్ చేశారు. ఆమె రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌‌కు చెందిన ఆయుర్వేద డాక్టర్. 37 ఏండ్ల వయసులోనే ఆమె మరణించడం బాధాకరమని, కొన్ని గంటల క్రితం వరకు హిమాలయాల ఫొటోలు పంపిన దీపా ఇలా మరణించడంపై మాటలు రావడం లేదని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు.