ఆస్పత్రి ఐసీయులో అగ్నిప్రమాదం: 8 మంది మృతి

ఆస్పత్రి ఐసీయులో అగ్నిప్రమాదం: 8 మంది మృతి

జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ (SMS) హాస్పిటల్లో నిన్న  రాత్రి ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐసియులో 11 మంది ఉన్నట్లు తెలుస్తుంది.

స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగగా, అగ్ని ప్రమాదానికిగల ఖచ్చితమైన కారణం తెలియలేదు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు సంభవించి ఉండోచ్చని అనుమానిస్తున్నారు. అయితే  స్టోరేజ్ ప్రదేశంలో ఉన్న  సామాగ్రి, ఐసియు పరికరాలు, ఇతర వస్తువులు మంటల్లో కాలిపోయాయి. 

మరణించిన 8 మందిలో ఆరుగురిని ఇప్పటికే గుర్తించారు. పొగ వేగంగా వ్యాపించడంతో పేషేంట్లు,  వారి కుటుంబాలు  ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాయి. దింతో ఆసుపత్రి సిబ్బంది, వార్డెన్స్  పేషేంట్లను బిల్డింగ్  బయట ఉన్న చోటుకి  తరలించారు. 

దీని పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పొగ హాస్పిటల్ మొత్తం వ్యాపించింది. 

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగారం పటేల్, హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ హాస్పిటల్  సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

జైపూర్‌ సవాయి మాన్ సింగ్ హాస్పిటల్లో జరిగిన అగ్నిప్రమాదం చాలా దురదృష్టకరం. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే నేను డాక్టర్లు,    అధికారులతో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేసాను. రోగుల భద్రత, చికిత్స, వారి సంరక్షణ కోసం సాధ్యమైన ప్రతి చర్య తీసుకుంటాం, పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం  అండగా ఉంటుంది అలాగే వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తాము అని అన్నారు.