
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమాయకుల ప్రాణాలు తీస్తోన్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. టెర్రరిస్టులు పాకిస్థాన్‌లో ఉన్నా వదిలిపెట్టేది లేదని.. ఉగ్రవాదులు ఎక్కడుంటే అక్కడికెళ్లి తుది ముట్టిస్తామని హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రసార సంస్థ ఎన్వోఎస్ సంస్థకు గురువారం (మే 22) జైశంకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్, దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు.
‘‘ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సిందూర్ ప్రధాన లక్ష్యం. ఆపరేషన్ సిందూర్‌కు ఒక నిర్ధిష్టమైన లక్ష్యం ఉండటం వల్ల ఆపరేషన్ కొనసాగుతోంది. పహల్గాం వంటి ఉగ్రదాడులు జరిగితే ప్రతిస్పందన కూడా అదే రేంజులో ఉంటుంది. ఉగ్రవాదులపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్న వదిలిపెట్టం. వారు ఉన్న చోటుకెళ్లి మరీ అంతమెందిస్తాం. కాబట్టి ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఒక్క కాల్పుల రూపంలోనే ఉండాల్సిన పని లేదు. ప్రస్తుతం కాల్పులు విరమణ, సైనిక చర్యలను నిలిపివేత కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు.
భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న ట్రంప్ వ్యాఖ్యలపైన జైశంకర్ క్లారిటీ ఇచ్చారు.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ, సైనిక చర్యను తగ్గించడానికి రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయని.. ఇందులో మూడవ పక్షం మధ్యవర్తిత్వం లేదని ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలంటే పాక్ నేరుగా భారత్‌తోనే మాట్లాడాలనే విషయాన్ని అమెరికాతో సహా అంతర్జాతీయ సమాజానికి న్యూఢిల్లీ స్పష్టంగా తెలియజేసిందన్నారు. కాకపోతే.. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌తో చర్చలు జరిపారని తెలిపారు.