కేంద్రానిది బీసీ వ్యతిరేక వైఖరి: జాజుల శ్రీనివాస్ గౌడ్

కేంద్రానిది బీసీ వ్యతిరేక వైఖరి: జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో బీసీ సంఘాల మెరుపు ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన బీసీ వ్యతిరేక వైఖరిని వెంటనే వీడనాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జనగణనలో బీసీ కులాలను లెక్కించకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జాజుల నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు మెరుపు ధర్నా నిర్వహించారు. జనగణనలో బీసీ కుటుంబాల వివరాలను నమోదు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేకంగా సబ్ కోటా కేటాయించాలన్నారు. 

రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచాలని కోరారు. ధర్నా సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. బీసీల సమస్యలపై పార్లమెంట్‌‌‌‌లో కొట్లాడాల్సిన రాహుల్ గాంధీ మౌనం వహిస్తుంటే, పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీసీల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకే తాను ముక్కలని, రెండు పార్టీలు బీసీ వ్యతిరేక వైఖరినే ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణనలో బీసీ కులాలను లెక్కించకపోతే29 రాష్ట్రాల ప్రతినిధులతో ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, రైల్ రోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అప్పటికీ సర్కారు దిగిరాకపోతే భారత్ బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నేతలు, మహిళలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.