రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం: జాజుల శ్రీనివాస్ గౌడ్

రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం: జాజుల శ్రీనివాస్ గౌడ్

వంగూర్, వెలుగు: రాజ్యాధికారంతోనే  బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  పేర్కొన్నారు.  బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్​యాదవ్  అధ్యక్షతన బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు నేటికీ రాజ్యాధికారం దక్కకపోవడం బాధాకరమన్నారు. 

చట్ట సభల్లో బీసీలకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించకుండా పాలకులు ఓటు బ్యాంకుగా చూస్తున్నారని మండిపడ్డారు. 5 శాతం ఉన్న వెలమలు, రెడ్లు అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలంతా ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి  ఐలమ్మ, కొమురం భీం లాంటి మహనీయుల స్ఫూర్తితో బీసీలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు మండల కేంద్రంలో ఉన్న ఫూలే, అంబేద్కర్  విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గెల్వలాంబ మాతను  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీ వైస్  చైర్మన్  ఠాగూర్ బాలాజీసింగ్, జువ్వ కృష్ణయ్య, పుల్లయ్య యాదవ్, కాశన్న యాదవ్, క్యామ మల్లయ్య, విక్రమ్ గౌడ్, శ్రీనివాసులు, రమేశ్ గౌడ్, ఎల్లాగౌడ్, జనార్ధన్, వెంకటేశ్, శ్రీను, తిరుపతయ్య పాల్గొన్నారు.