కాలువనే మాయం చేసిన్రు..

కాలువనే మాయం చేసిన్రు..

పక్కా సర్వే నంబర్లతో 1200 గజాలు రిజిస్ట్రేషన్​..?
భూదందాలో అధికార పార్టీ లీడర్​హస్తం..
కబ్జా ల్యాండ్​పై మాఫియా కన్ను

నర్సంపేట, వెలుగు : నర్సంపేట టౌన్​ పరిధిలోని సర్వాపురం శివారు జాలు బంధం కాల్వ మాయమైంది. నాలాపై కన్నేసిన అధికార పార్టీ లీడర్​ దర్జాగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారు. పాకాల చెరువుకు ప్రధాన కాల్వల్లో ఒకటైన జాలు బంధం కాల్వ నర్సంపేట టౌన్​ శివారు సర్వాపురం గ్రామం మీదుగా ప్రవహిస్తోంది. సాగునీటి అవసరాల కోసం ఈ కాల్వను రైతులు ఉపయోగిస్తుంటారు.  నర్సంపేట టౌన్​ మీదుగా 365 నేషనల్​హైవే  వెళుతోంది. ఈ ​హైవే పక్కన భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో కబ్జాకోరుల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడింది. 2021 ఏప్రిల్​లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు జాలు బంధం కాల్వను కబ్జా చేశాడు.  ఆ టైంలో ఇరిగేషన్​ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సాల్మాన్​, తహసీల్దార్​ రాంమూర్తి, సర్వేయర్​ దశరథ్​లతో పాటు పలువురు ఆఫీసర్లు జాలుబంధం కాల్వను పరిశీలించారు. ఈ విషయంలో సదరు లీడర్​ ‘ఊరికి నేనే బాస్​.. అంతా నా ఇష్టం’ అంటూ మాట్లాడటంతో  ఆఫీసర్లు విస్తుపోయారు.  దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్​ ఆఫీసర్లు అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనపై రూలింగ్​పార్టీ టాప్​ లీడర్​చక్రం తిప్పడంతో కేసు ఫైల్​ కాలేదు.

1200 గజాల రిజిస్ర్టేషన్​...?
సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ జాలుబంధం కాల్వను ఏకంగా ప్లాట్లుగా కాగితాలపై మలిచి రిజిస్ర్టేషన్​ చేయించుకున్నారు. కాల్వ పక్కనే ఉన్న ఓ పట్టాదారుడితో మాట్లాడుకుని అతనికి చెందిన సర్వే నంబర్లతో ప్లాట్లుగా రిజిస్ర్టేయిన్​ చేయించుకోవడం టౌన్​లో హాట్​టాపిక్​గా మారింది.  సుమారు 420 ఫీట్లు వెడల్పు, 30 ఫీట్ల లోతుతో ప్లాట్లుగా రిజిస్ర్టేషన్​ చేసుకున్నారు. మార్కెట్​లో ఈ ల్యాండ్​ విలువ సుమారు రూ.కోటి 20 లక్షల వరకు ఉంటుంది.  ఈ ల్యాండ్​ను అమ్మి పెట్టాల్సిందిగా సదరు లీడర్​రియల్​ ఎస్టేట్​ఏజెంట్లను కోరినట్లు సమాచారం. 

రంగంలోకి ల్యాండ్​ మాఫియా
లీడర్​కబ్జా చేసిన జాలుబంధం కాల్వపై ల్యాండ్​ మాఫియా కన్నేసింది. 1200 గజాల స్థలాన్ని కారు చౌకగా కొనేందుకు పలు దఫాలుగా చర్చలు జరిపారు. కుల్​గుత్తాగా ఈ ల్యాండ్​ను ల్యాండ్​ మాఫియా ముఠా మాట్లాడుకుని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనే చర్చ సాగుతోంది.  మరోవైపు గతేడాది జాలుబంధం కబ్జాకు గురైనప్పుడు ఉన్న ఆఫీసర్లే ఇప్పుడూ ఉన్నారు. వారిప్పుడు ఏం చేస్తారోనని  పట్టణవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.