
జమ్మికుంట, వెలుగు : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయని మహిళను నమ్మించిన ఓ యువకుడు చివరకు ఆమెను మోసం చేశాడు. ఈ ఘటన జమ్మికుంట పట్టణంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణానికి పొనగంటి కావ్య భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో ఓ ప్రైవేట్ కొరియర్ నడిపే మ్యానకొండ సాయికిరణ్‌తో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయని కావ్యకు చెప్పాడు. దీంతో నిజమేనని నమ్మిన కావ్య పలు విడతలుగా రూ. 93 లక్షలను సాయికిరణ్‌కు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న యువకుడు ఎలాంటి ఆస్తులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన కావ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయికిరణ్‌తో పాటు అతడి తల్లిదండ్రులైన పద్మ, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి తన డబ్బులు ఇప్పించాలని కోరింది. కావ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.