
అనంత్‌నాగ్ అడవుల్లో గన్‌ఫైట్
టెర్రరిస్టుల హైడ్ ఔట్స్‌పై రాకెట్ లాంచర్లతో సైన్యం దాడులు
గుహలో నక్కిన టెర్రరిస్టులు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఆర్మీ చేపట్టిన జాయింట్ ఆపరేషన్ ఐదో రోజుకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కిన టెర్రరిస్టులతో 100 గంటలుగా పోరాటం కొనసాగిస్తున్నది. ఫారెస్ట్ ఏరియాను చుట్టుముట్టిన వందలాది మంది సోల్జర్లు, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు.. భీకరంగా గన్‌ఫైట్ సాగిస్తున్నారు. వర్షం కారణంగా శనివారం సాయంత్రం ఫైరింగ్ ఆగిపోగా.. ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. భద్రతా దళాలు మోటార్ షెల్స్, రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నాయి. హైటెక్ ఎక్విప్‌మెంట్‌తో అనుమానిత టెర్రర్ స్థావరాలను టార్గెట్ చేస్తున్నాయి. తర్వాత అడ్వాన్స్‌డ్ డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలతో అటాక్ చేస్తున్నాయి.
అదను చూసి.. అటాక్ చేసి..
ఇంటెలెజిన్స్ వర్గాల సమాచారం ఆధారంగా ఆర్మీ, పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ మొదలైంది. ఉదయాన్నే టెర్రరిస్టులు దాక్కున్న ప్రాంతానికి చేరుకోవడానికి బలగాలు ప్రయత్నించాయి. దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు, లోతైన గుంతలు ఉన్న ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది.
Also Rard:తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఓ చారిత్రాత్మక రోజు : ప్రభుత్వ విప్ సుంకరి రాజు
కఠినమైన భూభాగాలు, ప్రతికూల వాతావరణం భద్రతా దళాలకు ఏమాత్రం అనుకూలం కాదు. పైగా అక్కడికి వెళ్లడానికి ఒకే ఒక రూట్ ఉంది. దురదృష్టవశాత్తు అదే దారిలో వెళ్లిన సెక్యూరిటీ దళాలపై టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో కనీసం కవర్ చేసుకోవడానికి కూడా ఏ అడ్డూ లేకపోయింది. ఈ క్రమంలో టెర్రరిస్టుల కాల్పుల్లో భద్రతా సిబ్బంది నలుగురు చనిపోయారు.
కొత్త సవాలు
అడవుల్లో, హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందిన టెర్రరిస్టులు.. సుదీర్ఘ పోరాటంచేసే ఉద్దేశంతోనే వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయుధాలను, ఇతరత్రా వస్తువులను తీసుకెళ్లి, అంతా సిద్ధం చేసుకున్న తర్వాతే పోరాటానికి దిగినట్లు ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రకమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని వెల్లడిస్తున్నాయి. ఆల్పైన్ అడవుల్లో టెర్రర్ యాక్టివిటీలు ఇటీవల పెరిగిపోయాయి. జమ్మూ ప్రావిన్స్‌లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో కూడా ఇలాంటి నమూనానే కనిపిస్తుండటం గమనార్హం. గత మే నెలలో టెర్రరిస్టుల ట్విన్ అటాక్స్‌లో 10 మంది సోల్జర్లు చనిపోయారు. పీర్‌పంజల్ అటవీ ప్రాంతంలో భారీగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ నిర్వహించినా.. ఒక్క టెర్రరిస్టు జాడ కూడా దొరకలేదు. 2021 అక్టోబర్‌లో పూంచ్ -రాజౌరి ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ట్విన్ అటాక్స్‌లో 9 మంది సైనికులు చనిపోయారు..
ఆగిపోయిన కాల్పులు..
భారీగా ఆయుధాలతో వచ్చిన టెర్రరిస్టులు.. దట్టమైన అడవిలో ఏటవాలు ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతంలో నక్కారు. లష్కరే తాయిబా టెర్రర్ సంస్థకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఉండి ఉండొచ్చని తెలుస్తున్నది. ఆర్మీకి చెందిన అస్సాల్ట్, క్లింబింగ్ టీమ్ కూడా పొజిషన్ తీసుకుని.. టెర్రరిస్టులు హైడవుట్పై కాల్పులు జరుపుతోంది. షెల్లింగ్ తీవ్రంగా కొనసాగుతుండటంతో అడవిలో ఒకచోట నిప్పంటుకుంది. అయితే వర్షం కురవడంతో మంటలు ఆరిపోయాయి. ఆదివారం టెర్రరిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని తెలుస్తున్నది. అయితే అక్కడ నక్కిన టెర్రరిస్టులు చనిపోయారా? లేక అదను చూసి దాడి చేయాలని దాక్కున్నారా? లేక అక్కడి నుంచి పారిపోయారా? అనేది తెలియాల్సి ఉంది.