
‘‘పశ్చిమబెంగాల్లో కంటే జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు శాంతియుతంగా జరుగుతున్నాయి. కాశ్మీర్లో పంచాయతీ ఎన్నికల సమయంలో ఒక్క పోలింగ్ బూత్లోనూ హింసాత్మక ఘటనలు జరగలేదు. అదే బెంగాల్పంచాయతీ ఎన్నికల్లో హింస వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల్లో గెలిచిన వారి ఇళ్లు తగలబెట్టారు. వారంతా జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వచ్చింది. వారు చేసిన తప్పు ఏమిటంటే పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే’’అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బుధవారం ఓ జాతీయ న్యూస్ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోడీ.. బెంగాల్లో ఎన్నికల హింసకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారు, తటస్థులం అని చెప్పుకునే వారు బెంగాల్లో హింసపై మౌనంగా ఉంటున్నారని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని చెప్పారు. తనపై ద్వేషంతో వారు అన్నింటినీ క్షమించేస్తున్నారని, ఇది దేశానికి కొత్త సమస్యలను సృష్టిస్తోందని మోడీ అన్నారు.
టీఎంసీ పనైపోయినట్లే..
బీజేపీ చీఫ్ అమిత్‌షా కోల్‌కతా రోడ్‌షో సందర్భంగా చెలరేగిన హింసతో బీజేపీ, టీఎంసీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. ఈ అంశంపై ఈసీతో భేటీ అయ్యేందుకు టీఎంసీ సిద్ధమవుతుంటే.. బీజేపీ నేతలు ఇప్పటికే ఈసీని కలిసి మమతా బెనర్జీని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితుల గురించి మోడీ ప్రస్తావిస్తూ.. బీజేపీతో పాటు లెఫ్ట్, కాంగ్రెస్ కూడా బెంగాల్లో హింస గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, కానీ తమను తాము న్యూట్రల్‌గా చెప్పుకునే వారు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారని అన్నారు. ఓ బీజేపీ సీఎం హెలికాప్టర్ బెంగాల్లో ల్యాండ్ అయ్యేందుకు నిరాకరించారని, తమ పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదని, దీనంతటికీ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణమని ఆరోపించారు. బీజేపీకే కాదు లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలన్నా మమత భయపడుతున్నారని ఎగతాళి చేశారు. పీపుల్ పవర్ గురించి మమత ఆందోళన చెందుతున్నారని, బెంగాల్లో వాస్తవ పరిస్థితులు ప్రజలకు అర్థమైతే టీఎంసీ పనైపోయినట్లేనని మోడీ చెప్పారు.
ఎన్నికల అంశంగా ‘మోడీ’
‘‘మోడీ పేరు ఓ ఎన్నికల అంశంగా మారిన తొలి ఎలక్షన్లు ఇవే. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు దేశంలో లేదు. విజయం గురించి మాట్లాడే వారితో పాటు మమ్మల్ని ఓడించాలని చూస్తున్న వారు కూడా మోడీ గురించే మాట్లాడుతున్నారు. నేను పేద కులానికి చెందిన వాడినని నమ్ముతాను. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా చాలా మంది ఇంకా పేదరికంలోనే ఉండడం నన్ను బాధిస్తోంది. వారి గురించి మనం ఏమీ చేయలేమా అని అనిపించేది. పదేళ్ల యూపీఏ హయాంలో పేదల కోసం 25 లక్షల ఇళ్లు నిర్మించారు. మేము ఐదేళ్లలో 1.5 కోట్ల ఇళ్లు కట్టించాం. ఇంతకు ముందున్న ప్రభుత్వాలే పనులన్నీ చేసినట్లయితే.. మోడీ టాయిలెట్లు కట్టడం, ఇళ్లు నిర్మించడం, గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ ఇవ్వడం చేయక్కర్లేదు”అని మోడీ చెప్పారు.
భారీ మెజారిటీ సాధిస్తాం
‘‘ఎక్కువ ఓట్ షేర్, భారీ మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. జనమే ఈసారి ఎన్నికల్లో ఫైటింగ్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న స్లోగన్లలో ఎక్కువ శాతం పబ్లిక్‌నుంచి వచ్చినవే అంటే మీరు నమ్మలేరు. మా పీఆర్ ఏజెన్సీ, పార్టీ ఎటువంటి స్లోగన్లతో రాలేదు. ‘వచ్చేది మోడీనే’అనే స్లోగన్ నేను జనం నుంచి విన్న వాటిలో ఒకటి”అని మోడీ తెలిపారు. గత 20 ఏళ్ల నుంచి తాను సాధించిన ఇమేజ్ను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అయితే వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, వారిని చూస్తే జాలేస్తోందని టైమ్ మ్యాగజీన్ కవర్ స్టోరీ ‘డివైడర్ ఇన్ చీఫ్’పై మోడీ స్పందించారు.