జనగామ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు

జనగామ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు
  • జనగామ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు
  • అమృత్ భారత్ స్కీంకు ఎంపిక చేసిన కేంద్రం
  • అభివృద్ధి పనులపై రిపోర్టు రెడీ చేసిన ఆఫీసర్లు
  • త్వరలో ప్రారంభం కానున్న పనులు
  • పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని కోరుతున్న ప్రజలు

జనగామ, వెలుగు : ఎన్నో ఏళ్లుగా అరకొర వసతులతో నెట్టుకొస్తున్న జనగామ రైల్వే స్టేషన్ కొత్త హంగులు అద్దుకోనుంది. దేశంలోని పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రారంభించిన అమృత్ భారత్ స్కీమ్ కు జనగామ రైల్వే స్టేషన్ ఎంపికైంది. దీంతో ఇటీవల రైల్వే ఆఫీసర్లు స్టేషన్ ను పరిశీలించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రిపోర్టును తయారు చేశారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 

రెండు విడతల్లో అభివృద్ధి పనులు

జనగామ రైల్వే స్టేషన్ ను రెండు విడతల్లో డెవలప్ చేసేలా ప్లాన్ రూపొందిస్తున్నట్లు రైల్వే ఆఫీసర్లు చెబుతున్నారు. తొలి దశలో మొదటి ప్లాట్ ఫాంను అభివృద్ధి చేయనున్నారు. జనగామ పట్టణాన్ని రైల్వే స్టేషన్ రెండుగా విభజిస్తుండడం అభివృద్ధికి అడ్డంకిగా మారింది. స్టేషన్ ఇవతల ఉన్న వారు అవతలి వైపు వెళ్లాలంటే ట్రాక్ దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా స్టేషన్ సమీపంలోని అమ్మబావి వద్ద ఫస్ట్ ప్లాట్ ఫాం బయటి నుంచి సెకండ్ ప్లాట్ ఫాం అవతలి వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీంతో పాటు ఇప్పుడున్న బుకింగ్ కౌంటర్ ను మార్చి మరో చోట నిర్మించనున్నారు. అదేవిధంగా రైల్వే పోలీస్ స్టేషన్, స్టేషన్ మేనేజర్ ఆఫీస్ ను సైతం కొత్తగా నిర్మించనున్నారు.

ప్రస్తుతం ఒకటే ద్వారం ఉండడం వల్ల ప్రయాణికులు దీని నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా రెండో ద్వారం కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు స్టేషన్ బయట ఉన్న ఖాళీ ప్లేస్ లో బ్యూటిఫికేషన్, గార్డెనింగ్ పనులు చేపట్టనున్నారు. ఇక రెండో విడతలో సెకండ్ ప్లాట్ ఫాంను డెవలప్ చేసి అటువైపు కూడా బుకింగ్ కౌంటర్ నిర్మించనున్నారు. దీంతో పాటు మూడో ప్లాట్ ఫాం పనులను కూడా చేపట్టనున్నారు. 

హాల్టింగ్ లు పెంచాలని కోరుతున్న ప్రజలు

జనగామ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత రద్దీ మరింత పెరిగింది. దీంతో ఈ స్టేషన్ లో మరిన్ని రైళ్లు ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా షిర్డీ సాయి నగర్ ఎక్స్ప్రెస్, శాతవాహన, చార్మినార్, సింహపురి రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానికులు పలుమార్లు రైల్వే అధికారులకు, ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. అదే విధంగా చదువు, ఉద్యోగ రీత్యా జనగామ జిల్లాకు చెందిన వేలాది మంది నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి జనగామ వరకు ఎంఎంటీఎస్ రైలు నడపాలని కోరుతున్నారు.