బీఆర్ఎస్​ రాక్షస పాలనకు కాలం చెల్లింది: ప్రజాహిత పాదయాత్రలో అనిరుధ్​రెడ్డి

బీఆర్ఎస్​ రాక్షస పాలనకు కాలం చెల్లింది: ప్రజాహిత పాదయాత్రలో అనిరుధ్​రెడ్డి

నవాబుపేట, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్​ రాక్షస పాలనకు కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని మైసమ్మ ఆలయం ఆదివారం ప్రజాహిత పాదయాత్రను ప్రారంభించారు. కాకర్లపహాడ్, సిద్దోటం, కారుకొండ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ నిరుపేద జనాలను బీఆర్ఎస్​ సర్కార్​ మోసం చేసిందని విమర్శించారు. మండలంలో ఎన్ని డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు కట్టారో ఎంతమందికి ఇచ్చారో? ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

గ్రామాల్లో ఏండ్లుగా పింఛన్లు రాక వృద్ధులు, వికలాంగులు, రుణమాఫీ కాక రైతులు, డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు రాక నిరుపేదలు, భృతి లేక నిరుద్యోగులు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ నాయకులు రౌడీల్లా ప్రవర్తిస్తూ కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.5 లక్షలతో ఇండ్లు కట్టిస్తామని, రూ.500 సిలిండర్​ అందిస్తామని, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దుశ్యంత్​రెడ్డి, సునీతారావు, వసంత, వాసు యాదవ్, భద్రునాయక్, తుల్సీరాంనాయక్, రాములునాయక్, మల్లేశ్​యాదవ్, డా.మీనాక్షి,​ నవాజ్​రెడ్డి, పెద్ది నర్సింలు, జగన్​రెడ్డి, తానెంరాజు, నారాయణ్​రెడ్డి, ఆంజనేయులు, కుమార్​ పాల్గొన్నారు.