జనగామలో ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా.. హైదరాబాద్లో గుట్టుగా క్యాంప్ రాజకీయాలు

జనగామలో ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా.. హైదరాబాద్లో గుట్టుగా క్యాంప్ రాజకీయాలు

 జనగామ  ఎమ్మెల్యే టికెట్‌పై బీఆర్ఎస్‌లో రాజకీయం ముదురుతోంది. ఇన్నాళ్లు నియోజకవర్గానికే పరిమితం అయిన జనగామ టికెట్ల లొల్లి..ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న స్థానిక నేతలు.. ఎమ్మెల్యేకు తెలియకుండా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సమావేశమవడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

జనగామ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ లొల్లి నడుస్తోంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి.. స్థానిక నేతలకు మధ్య విభేదాలు రావడంతో..వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని.. మరెవ్వరికి ఇచ్చిన తమకు సహకరిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే చెప్పారు. ఇదే సమయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను  ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నట్టు.. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం నేతలు, నాయకులు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో జనగామ టికెట్ పల్లాకే ఇవ్వాలని మీటింగ్ పెట్టుకున్నట్లు సమాచారం.  కొందరు సర్పంచులు, ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తమను హైదరాబాద్ పిలిపించారంటూ కొంత మంది నేతలు చెప్తున్నారు. మరికొందరేమో.. కేవలం మంత్రిని కలిసేందుకే వచ్చామని బుకాయిస్తున్నారు. 

టూరిజం ప్లాజాలో జనగామ నియోజకవర్గం ముఖ్యనేతలు మీటింగ్ పెట్టుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి...అక్కడ ప్రత్యక్షమయ్యారు. జనగామ నేతలను చూసిన ఎమ్మెల్యే.. ఇలా వచ్చారేంటీ అంటూ పలకరించారు. అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టూరిజం ప్లాజాలో దర్శనమివ్వడంతో జనగామ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే  తాము మంత్రి హరీశ్ రావును కలిసేందుకు వచ్చామని తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం సమర్పించనున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే తనతో రండి మంత్రి హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్తానంటూ ఎమ్మెల్యే చెప్పగా..స్థానిక నేతలు తిరస్కరించాట. 

జనగామ నియోజకవర్గంలో తనకు తెలియకుండా కుట్రలు జరుగుతున్నాయన్న దానికి ఈ క్యాంపు రాజకీయాలే సాక్ష్యమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా....అంతిమంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు తన గురించి పూర్తిగా తెలుసన్నారు. తనపై చేస్తున్న కుట్రల్లో భాగంగానే .. తన కూతురిని ఉసిగొల్పుతున్నారంటూ చెప్పుకొచ్చారు. హరిత ప్లాజా మీటింగ్ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు. 
 

ఓ వైపు టూరిజం ప్లాజాలో  తనకు వ్యతిరేకంగా మీటింగ్ జరుగుతుండగా..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు. జనగామ నియోజకవర్గం టికెట్ పై జరుగుతున్న తాజా పరిణామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకే ముత్తిరెడ్డి ప్రగతి భవన్కు వెళ్లారని తెలుస్తోంది.