జనగామ మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను పెంపునకు రెడీ

జనగామ మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను పెంపునకు రెడీ
  • ఇండ్లు, కమర్షియల్​ బిల్డింగ్స్​ కొలతలు
  • ఫొటోలు, వివరాలు ‘భువన యాప్’లో నమోదు
  • చివరి దశకు చేరిన ప్రక్రియ
  • 10 నుంచి 20 శాతం పెంచేందుకు అవకాశం

జనగామ, వెలుగు: మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను పెంచడానికి రంగం సిద్ధం అవుతోంది. ఇండ్లకు సంబంధించిన పూర్తి కొలతలు భువన యాప్​లో నమోదు చేస్తున్నారు. గతంలో చెల్లించిన ఇంటి పన్నుల్లో పొరపాట్లను కూడా సవరించే అవకాశం కూడా ఉంది.

రెండు మున్సిపాలిటీలు.. 

జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్​పూర్​ మున్సిపాలిటీలున్నాయి. జనగామలో 30 వార్డులు ఉండగా, గత ఫైనాన్స్​ఇయర్​ లెక్కల ప్రకారం పన్ను చెల్లించే నిర్మాణాలు మొత్తంగా 15,818 ఉన్నాయి. వీటిల్లో ఇండ్లు 13,010 ఉండగా, ఇండ్లు, షాపులు కలుపుకొని 1670 నిర్మాణాలున్నాయి. పూర్తి కమర్షియల్​గా 1138 నిర్మాణాలున్నాయి. వీటన్నింటినీ కలుపుకొని ఏటా రూ.6.03 కోట్ల పన్ను వసూలు కావాలి. స్టేషన్ ఘన్​పూర్​లో 18 వార్డులు ఉండగా, గత ఫైనాన్స్​ ఇయర్​ లెక్కల ప్రకారం పన్ను చెల్లించే నిర్మాణాలు కమర్షియల్, ఇండ్లు కలిపి 6539 ఉన్నాయి. రూ.2 కోట్లకు పైబడి పన్నులు వసూలు కావాల్సి ఉంది.  

చివరి దశకు నిర్మాణాల కొలతలు..

ఇంటి పన్ను పెంపునకు ఆఫీసర్లు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిర్మాణ కొలతలకు సంబంధించి శాటిలైట్ ద్వారా సర్వే చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా పని చేసే గ్లోబల్​ ఇన్​ఫర్​మేటిక్ సంస్థకు అప్పగించారు. అనంతరం మాన్వువల్​ పద్ధతిలో కొలతలు వేయించి 'భువన యాప్' లో అప్​లోడ్​ చేసేందుకు  నిర్ణయించారు. ఒక్కో నిర్మాణాన్ని అన్ని డిగ్రీల కోణంలో ఫొటోలు తీస్తున్నారు. వైశాల్యం, నల్లా కనెక్షన్లు, విద్యుత్‌‌‌‌‌‌‌‌మీటర్లు, భవనాలపై ప్రచార బోర్డులు, సెల్‌‌‌‌‌‌‌‌టవర్‌‌‌‌‌‌‌‌ ఉంటే వాటి వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఈ వివరాలను యాప్​లో అప్​లోడ్​ చేస్తున్న ప్రక్రియ కూడా చివరి దశకు చేరింది.

10 నుంచి 20 శాతం పెంపు..

నిర్మాణాలకు సంబంధించి కొలతలు, వివరాల సేకరణ పూర్తయిన అనంతరం ఇంటి పన్నును సవరించనున్నారు. గతంలో ఇండ్ల నిర్మాణాలకు మీటరుకు రూ.17 నుంచి రూ.24, కమర్షియల్ నిర్మాణాలకు మీటరుకు రూ.24 నుంచి రూ. 28 వరకూ వసూలు చేసేవారు. కాగా, ఇప్పుడు వసూలు చేస్తున్న మొత్తానికి 10 నుంచి 20 శాతం పన్ను పెంచే అవకాశాలు ఉన్నాయి. జనగామ మున్సిపాలిటీకి రూ.కోటి, స్టేషన్ ఘన్​పూర్​లో మరో రూ.30 లక్షల వరకూ అదనపు ఆదాయం పెరుగుతుంది. ఈ పన్ను పెంపు జులైలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, 2026-27 ఫైనాన్స్​ ఇయర్​ నుంచి అమలు చేస్తారు. 

పన్ను నిర్ణయం విషయంలో గతంలో కొందరు తమకు ఎక్కువగా వేస్తున్నారంటూ ఫిర్యాదులు చేయగా, ఆయా నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. ఎక్కువగా విధించినట్టయితే తగ్గింపు, తక్కువగా విధించిన వాటికి పెంచే అవకాశం ఉంది. దీంతో పన్ను చెల్లింపుల్లో మార్పులు జరగనున్నాయి. 

కొలతలు, వివరాలు తీసుకుంటున్నం..

మున్సిపాలిటీలోని ఇండ్లు, కమర్షియల్ ప్రాపర్టీ వివరాలు తీసుకుంటున్నం. ప్రతి స్టక్చర్​ కొలతలు తీసుకుంటున్నం. వివరాలను భువన యాప్​లో నమోదు చేస్తున్నం. ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది. హయ్యర్ ఆఫీసర్లకు పంపిస్తాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం.  

- మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, జనగామ