ధరల పెరుగుదల కట్టడికి జపాన్ ప్లాన్..ప్రజల జేబుల్లోకి రూ.1.86 లక్షల కోట్లు

ధరల పెరుగుదల కట్టడికి జపాన్ ప్లాన్..ప్రజల జేబుల్లోకి రూ.1.86 లక్షల కోట్లు
  • ద్రవ్యోల్బణం కట్టడికి జపాన్ ప్లాన్‌‌..

న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం కారణంగా  పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు జపనీస్ ప్రభుత్వం  చర్యలను ముమ్మరం చేసింది.  ప్రజలకు డైరెక్ట్‌‌గా డబ్బు పంచడానికి, ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చేందుకు   ప్రధానమంత్రి సనాయే తకైచి కేబినెట్  3.1 ట్రిలియన్ యెన్ల (సుమారు రూ.1.86 లక్షల కోట్ల) అదనపు తాజాగా బడ్జెట్‌‌ను ఆమోదం తెలిపింది.   ఇందులో భాగంగా  2.5 ట్రిలియన్ యెన్ల రిజర్వ్ ఫండ్‌‌ ఏర్పాటు చేస్తారు.  దీనిని వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి, తక్కువ ఆదాయం గల ప్రజలకు డైరెక్ట్‌‌గా డబ్బు ఇచ్చేందుకు,  గ్యాస్‌‌, కరెంట్ డిస్ట్రిబ్యూషన్‌‌, పెట్రోల్‌‌, డీజిల్ వంటివి అమ్మే కంపెనీలకు రాయితీ ఇచ్చేందుకు వాడనున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.   

నిధులు ఇలా..

ఈ ప్యాకేజీ కోసం నిధులు సమకూర్చడానికి జపనీస్ ప్రభుత్వం కొత్తగా అప్పులు  తీసుకోవాల్సి ఉంటుంది. అదనపు రుణాలు తీసుకున్నప్పటికీ క్యాలెండర్ ప్రాతిపదికన మొత్తం బాండ్ల జారీని మార్చకుండా ఉంచడానికి  గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కింద అనుమతించిన కొన్ని అప్పులను రద్దు చేయనున్నారు. ఈ అదనపు బడ్జెట్‌‌ను బుధవారం పార్లమెంటుకు సమర్పించారు. దీనికి శుక్రవారం నాడే ఆమోదం లభించే అవకాశం ఉంది.    

తాజా  బడ్జెట్ వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో జపాన్ మొత్తం ప్రభుత్వ బాండ్ల జారీ అసలు ప్లాన్‌‌ కంటే 3.1 ట్రిలియన్ యెన్లు పెరిగి సుమారు 183.8 ట్రిలియన్ యెన్లకు చేరుకుంటుంది. కాగా, గృహ విద్యుత్, గ్యాస్ బిల్లులపై ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాయితీలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.