‘ఎలా నవ్వాలో’ నేర్చుకోవడం కోసం జపాన్ లో ప్రత్యేక క్లాసులు

‘ఎలా నవ్వాలో’ నేర్చుకోవడం కోసం జపాన్ లో ప్రత్యేక క్లాసులు

నవ్వడం ఒక వరం, యోగం, భోగం అంటూ... కవులు నవ్వు గురించి చాలా చెప్పారు.  నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచింది. ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా పని చేస్తుంది. ఒక చిన్న నవ్వు ఎన్నో సమస్యల నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది. కొండంత రిలీఫ్ ను ఇస్తుంది. చిన్న నవ్వు నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడానికి, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. నవ్వేటప్పుడు మన శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి బ్రెయిన్‌కి మంచి కెమికల్స్. ఇవి మన మూడ్‌ని ఆనందంగా మార్చుతాయి. ఫుల్ ఖుషీ అయిపోతాం. శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఒత్తిడికి కారణం ఈ హార్మోనే. మనం పగలబడి నవ్వేటప్పుడు.. మన బ్రెయిన్‌కి మనం రిలాక్స్‌గా ఉన్నామనే సిగ్నల్స్ వెళ్తాయి. దాంతో... టెన్షన్, ఆదుర్తా తగ్గిపోతుంది.

ఇదంతా బాగానే ఉంది.. ఇక అసలు విషయానికి వస్తే.. జపాన్ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా నవ్వునే మర్చిపోయారట. నవ్వడం, ఏడ్వడం.. ఇవన్నీ మనిషి పుట్టుకతోనే వచ్చే గుణాలు. అందుకే ఎలా నవ్వాలో, ఎలా ఏడ్వాలో ఎవరూ చెప్పరు. అవి స్వాభావికంగానే వచ్చేస్తాయి. కానీ... జపాన్ ప్రజలు చిరునవ్వు ఎలా నవ్వాలో నేర్పించమని నిపుణులను కోరుతున్నారట. స్వయంగా క్లాసులకు కూడా వెళ్తున్నారట. ఈ విషయం మనకు కాస్తా ఆశ్చర్యకరంగా.. నవ్వు తెప్పించే విధంగానూ ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజమే అంటున్నారు జపాన్ ప్రజలు. 

జపాన్ ప్రజలు మూడేళ్లుగా నవ్వులకు దూరమయ్యారు. కరోనా కారణంగా వారంతా మాస్కులు ధరంచారు. అందువల్ల వారి ముఖాల్లో నవ్వు అనేది లేకుండా పోయింది. చాలా మంది నవ్వడం మానేశారు. దాంతో.. నవ్వు వారికి దూరమైంది. ఈ మధ్యే జపాన్ ప్రభుత్వం.. కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. దాంతో అక్కడి ప్రజలకు విముక్తి లభించినట్లైంది. ఇప్పటికీ చాలా మంది ఫేస్ మాస్కులు వాడుతున్నారు. అలాంటి వారిలో చాలా మందికి... తాము సరిగ్గా నవ్వుతున్నామా లేదా అనే డౌట్ వస్తోంది. ఎందుకైనా మంచిదని నిపుణులను సంప్రదిస్తున్నారట. 

https://twitter.com/MorningBrew/status/1656415062796500992

నవ్వడం కష్టమేమీ కాదు.. కానీ.. ఎప్పుడు ఏ స్థాయిలో నవ్వాలి అనేది కీలక అంశం. జపాన్ ప్రజలకు ఇదే సమస్యగా మారింది. ఎక్కడ ఎంత నవ్వాలి? చిరునవ్వు ఎలా నవ్వాలి? బిగ్గరగా ఎలా నవ్వాలి? వంటి విషయాల్ని వారు ఇప్పుడు స్పెషల్ క్లాసుల్లో నేర్చుకుంటున్నారు. ఈ స్మైల్ ట్రైనింగ్ కోసం జపాన్ ప్రజలు ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. నెలవారీ బడ్జెట్‌లో నవ్వుల కోసం కొంత కేటాయిస్తున్నారు. అయినప్పటికీ కొంతమందిలో తాము సరిగా నవ్వట్లేదనే ఆత్మన్యూనతా భావం ఉంటోంది. తాము నవ్వేటప్పుడు చుట్టుపక్కల వారు తమ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ.. తెగ ఫీలైపోతున్నారట. ఆ భయం పోగొట్టేందుకు నిపుణులు ప్రయత్నిస్తు్న్నారు. మొత్తానికి కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాల్ని బలితీసుకోవడమే కాకుండా.. బతికి ఉన్న వారి నవ్వులను కూడా దూరం చేసింది.