
భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు శిబు సోరెన్. న్యాయం, గుర్తింపు, గౌరవానికి ఆయన నిలువెత్తు ప్రతీక. జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం తనదైన ముద్రవేసిన జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. 'గురూజీ'గా జార్ఖండ్ ప్రజలకు సుపరిచితమైన శిబు సోరెన్ మరణం పట్ల ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఆవేదనకు గురయ్యారు.
ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ఆయన కుమారుడు. శిబు సోరెన్ అగ్రకుల, మతాధిపత్య రాజకీయాలలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మూడుసార్లు జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, మూడుసార్లూ కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు.
మార్చి 2005లో సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే, తొమ్మిది రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2008 ఆగస్టులో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేవలం ఐదు నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2009 డిసెంబర్ నుంచి మే 2010 వరకూ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా, మూడుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. గిరిజన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు శిబు సోరెన్.
జీవితమే ఓ పోరాటం
జార్ఖండ్ రాష్ట్రంలో దాదాపు 33 షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. జనాభాలో 39 శాతానికి పైగా గిరిజనులు, దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. దేశంలోని మొత్తం ఖనిజాలలో 40 శాతం ఆ రాష్ట్రంలోనే లభ్యమవుతున్నాయి. అయినప్పటికీ అక్కడ దశాబ్దాలపాటు పేదరికం, నిరుద్యోగం, అణచివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జార్ఖండ్‌లోని సారవంతమైన గిరిజనుల భూములన్నీ బిహార్ మైదానప్రాంతం నుంచి వచ్చిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు ఆక్రమించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో చిన్నతనంలోనే శిబు సోరెన్ తిరుగుబాటు చేశారు. 18 ఏండ్ల వయసులో సంతాల్ నవయువక్ సంఘ్ అనే సంస్థను స్థాపించారు. 1972లో బెంగాల్ కమ్యూనిస్టు నాయకులు ఏకే రాయ్, కుర్మి మహతో నాయకుడు బినోద్ బిహారీ మహతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీని స్థాపించారు.
గిరిజనుల హక్కులు, సాధికారత కోసం పోరాటం చేశాడు. లక్ష్యం సాధించేవరకు వెనుదిరగలేదు. బిహార్ భూస్వాములు, దోపిడీదారులు, వలసవాదుల నుంచి గిరిపుత్రులకు సొంత రాష్ర్టాన్ని, స్వయం పాలనను సాధించిపెట్టిన నాయకుడు శిబు సోరెన్. ఉద్ధండ రాజకీయ నాయకులు కూడా దిగొచ్చి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు స్వయంగా అంగీకరించేలా చేసిన గొప్ప చతురత గల నాయకుడు. ఆయన కృషి ఫలితంగానే 2000వ సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఆయన ప్రత్యేక రాష్ట్ర పోరాటం దేశ చరిత్రలో చర్చనీయాంశంగా మారింది. ప్రాంతీయ వాదానికి బీజం పడింది.
తెలంగాణకు తొలి మద్దతుదారుడు
జార్ఖండ్‌లో అణచివేత, అన్యాయాలపై పోరాడిన శిబు సోరెన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తొలి మద్దతుదారుగా నిలిచారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న సమయంలో తెలంగాణకు వచ్చి సభల్లో పాల్గొన్నారు.
శిబూ సోరెన్ ప్రాంతీయవాదానికి మద్దతు ఇచ్చినప్పటికీ... ఆయన వాస్తవ పోరాటం అగ్రకుల దోపిడీ ఆధిపత్య వర్గాలపైనే. ఆయన స్వశక్తి, స్వరాజ్య పోరాటం అర్థమైనట్లయితే 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతిలో తెలంగాణ రాష్ట్రం ఉండేది. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన సబ్బండ వర్గాల రాజ్యం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీలతో మరో జేఏసీ(జాక్ )ఆవిర్భవించింది.
ఇది ఆ వర్గాల్లో సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చైతన్యాన్ని రగిలించడానికి ఏర్పడింది. శిబూ సోరెన్ స్వరాజ్య రాజకీయ పోరాటం పుణికి పుచ్చుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకమై పాలకులు కావడమే శిబూ సోరెన్‌కు మనం ఇచ్చే ఘనమైన నివాళి.
- సంపతి రమేశ్ మహారాజ్,సోషల్ ఎనలిస్ట్-