ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ 416

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ 416
  • బ్యాట్‌, బాల్‌తో జస్‌ప్రీత్‌ బుమ్రా హల్‌చల్‌
  • ఒకే ఓవర్లో 29 రన్స్‌‌‌‌ కొట్టి వరల్డ్‌‌ రికార్డు
  • జడేజా సెంచరీ  
  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ 416
  • ఇంగ్లండ్‌‌ 84/5

బర్మింగ్‌‌‌‌హామ్‌‌:  కపిల్‌‌ దేవ్‌‌ తర్వాత ఇండియా కెప్టెన్సీ అందుకున్న పేసర్‌‌గా రికార్డు సృష్టించిన జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా.. లెజెండరీ క్రికెటర్‌‌ను మరిపిస్తున్నాడు. ఇంగ్లండ్‌‌తో ఐదో  టెస్టులో బ్యాట్‌‌, బాల్‌‌తో ఓ రేంజ్‌‌లో విజృంభిస్తున్నాడు. కెప్టెన్సీ తనకు భారం కాదని నిరూపిస్తూ.. ‘బూమ్​ బూమ్​’ బుమ్రా ఆల్‌‌రౌండ్‌‌ షో చేసిన వేళ రెండో రోజు కూడా ఇండియా హవా నడిచింది. వర్షం వల్ల శనివారం కేవలం 39 ఓవర్లు మాత్రమే సాధ్యమైనా.. బుమ్రాసేన మ్యాచ్‌‌పై పట్టు బిగించింది. రవీంద్ర జడేజా (194 బాల్స్‌‌లో 13 ఫోర్లతో 104) కెరీర్‌‌లో మూడో సెంచరీకి తోడు ..ఒకే ఓవర్లో అత్యధిక రన్స్​ (29) కొట్టిన బ్యాటర్​గా  బుమ్రా (16 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 నాటౌట్‌‌) రికార్డు సృష్టించడంతో  ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 338/7తో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 416 వద్ద ఆలౌటైంది. అనంతరం బుమ్రా (3/35) బాల్‌‌తోనూ చెలరేగడంతో  రెండో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్‌‌ 84/5 తో కష్టాల్లో పడింది. ఓపెనర్లు లీస్‌‌ (6), క్రాలీ (9)తో పాటు ఫామ్‌‌లో ఉన్న జో రూట్‌‌ (31) పెవిలియన్‌‌ చేరగా  జానీ బెయిర్‌‌ స్టో (12 బ్యాటింగ్‌‌), బెన్‌‌ స్టోక్స్‌‌ (0 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.  ప్రస్తుతం ఇండియా 332 రన్స్‌‌ ఆధిక్యంలో ఉంది. మూడో రోజు వీలైనంత తొందరగా ఇంగ్లండ్‌‌ను ఆలౌట్‌‌ చేస్తే బుమ్రాసేన తప్పకుండా మ్యాచ్‌‌ గెలుస్తుంది. 

జడ్డూ వంద.. బుమ్రా అండ
తొలి రోజు పంత్‌‌తో కలిసి ఇండియా ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టిన జడేజా అదే జోరును కొనసాగిస్తూ మంచి స్కోరు అందించాడు. మాథ్యూ పాట్స్‌‌ బౌలింగ్‌‌లో అద్భుతమైన  కట్‌‌ షాట్‌‌తో కవర్‌‌ పాయింట్‌‌ మీదుగా  ఫోర్‌‌ కొట్టిన జడ్డూ సెంచరీ (183 బాల్స్‌‌లో) పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వెంటవెంటనే మూడు ఫోర్లు రాబట్టి దూకుడు మీద కనిపించిన షమీ (16)ని తర్వాతి ఓవర్లో బ్రాడ్‌‌ పెవిలియన్‌‌ చేర్చగా.. కాసేపటికే ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌తో జడ్డూను అండర్సన్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. అప్పటికి 375/9తో నిలిచిన ఇండియా మరో పది పరుగులు చేస్తే గొప్పే అనిపించింది. కానీ,  బ్రాడ్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో బుమ్రా ధనాధన్‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. అతని స్పీడుకు బ్యాట్‌‌ అంచుకు తగిలిన బాల్స్‌‌ కూడా బౌండ్రీ లైన్‌‌ దాటాయి. దాంతో, ఇండియా స్కోరు 400 మార్కు దాటింది. అయితే, తర్వాతి ఓవర్లో సిరాజ్‌‌ (2)ను పెవిలియన్‌‌ చేర్చి ఇండియా ఇన్నింగ్స్‌‌ను ముగించిన  అండర్సన్​ (5/60)  ఐదు వికెట్ల హాల్‌‌ సాధించాడు.  ఈ ఇన్నింగ్స్‌‌లో చివరి మూడు స్థానల్లో వచ్చిన బ్యాటర్ల సాయంతో ఇండియా 93 రన్స్‌‌ రాబట్టడం విశేషం. 

సూపర్‌‌ బౌలింగ్‌‌
బ్యాట్‌‌తో మెప్పించిన బుమ్రా తర్వాత తన మార్కు బౌలింగ్‌‌తో  ఇంగ్లండ్‌‌ను దెబ్బకొట్టాడు.  పిచ్‌‌ నుంచి వస్తున్న సపోర్ట్‌‌ను సద్వినియోగం చేసుకొని. ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో   లెంగ్త్‌‌ బాల్స్‌‌తో పాటు ఆఫ్‌‌ స్టంప్‌‌నకు దూరంగా బాల్స్‌‌ వేస్తూ  ఇంగ్లిష్‌‌ ప్లేయర్లను వణికించాడు. ఇన్నింగ్స్‌‌ మూడో ఓవర్లోనే అద్భుతమైన లెంగ్త్‌‌ బాల్‌‌తో ఓపెనర్‌‌ లీస్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. వర్షం రావడంతో కాస్త ముందుగానే లంచ్‌‌ ప్రకటించారు. బ్రేక్‌‌ తర్వాత తన తొలి బాల్‌‌కే క్రాలీని వెనక్కు పంపాడు. ఈ దశలో మరోసారి వర్షం వచ్చి రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలవగా.. బుమ్రా అదే జోరు కొనసాగించాడు. బుమ్రా ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో వేసిన వైడ్‌‌ బాల్‌‌ను వెంటాడిన ఒలీ పోప్‌‌ (10) రెండో స్లిప్‌‌లో శ్రేయస్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. ఈ దశలో మళ్లీ  వాన రావడంతో టీ బ్రేక్‌‌ ఇచ్చారు. సాయంత్రం ఆట తిరిగి మొదలవగా ఈ సారి సిరాజ్‌‌(1/5), షమీ (1/33) రాణించారు. బెయిర్‌‌స్టోతో కలిసి నిలకడగా ఆడుతున్న డేంజర్‌‌ మ్యాన్‌‌ రూట్‌‌ను సిరాజ్‌‌షార్ట్‌‌ పిచ్‌‌ బాల్‌‌తో బోల్తా కొట్టించగా.. కాసేపటికే జాక్‌‌ లీచ్‌‌ (0)ను షమీ ఐదో వికెట్‌‌గా వెనక్కుపంపి రెండో రోజుకు ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చాడు.