‘జయ.. జయహే తెలంగాణ’ పూర్తి గీతానికి ట్యూన్

‘జయ.. జయహే తెలంగాణ’ పూర్తి గీతానికి ట్యూన్
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో మొత్తం 13 నిమిషాల పాట ప్లే
  • స్కూళ్లలో, ఇతర ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివి తగ్గింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గీతం‘‘జయ జయహే తెలంగాణ జనని జయకేతనం’’కు ట్యూన్ పూర్తి కావొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి బాణీలు అందిస్తున్నారు. గీతం ట్యూన్ ఎలా ఉండబోతుందనేది సీఎం రేవంత్ రెడ్డికి మ్యూజిక్ స్టూడియోలో కీరవాణి కొంత పాడి వినిపించారు. పాట ట్యూన్ నిడివి 13 నిమిషాలు వస్తున్నది.

ఈ మొత్తం పాటను రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో ప్లే చేయనున్నారు. స్కూళ్లు, ఇతర ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివిని తగ్గించనున్నారు. గీతం మొత్తం కాకుండా అర్థం మొత్తం వచ్చేలా కొన్ని లిరిక్స్​తోనే2, 3 నిమిషాలు వచ్చేలా అందెశ్రీ సూచనలకు అనుగుణంగా కీరవాణి దానికి ట్యూన్ చేయనున్నట్లు తెలిసింది.మ్యూజిక్ స్టూడియోకు సీఎం రేవంత్ తో పాటు అందెశ్రీ, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి వెళ్లారు.

నేడు కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేరళకు వెళ్లనున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ ఆహ్వానం మేరకు ఆయన కేరళలోని కోజికోడ్ లో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నారు.